
విప్ ధిక్కరించిన 27 మందిపై అనర్హత వేటు వేయండి
వైఎస్సార్ సీపీ డిమాండ్
సాక్షి, విశాఖపట్నం: మేయర్‌పై జరిగిన అవిశ్వాస తీర్మానంలో పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన 27 మంది వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆ పార్టీ విప్ తైనాల విజయ్‌కుమార్.. జిల్లా ఎన్నికల అధికారి, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ హరేందిర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. 2008 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం(జీవో ఎంఎస్ నంబర్ 836/ఎంఏయూడీ)లోని రూల్ నంబర్ 9 లోని ‘నో కాన్ఫిడెన్స్ మోషన్’ నిబంధనలను ఈ సందర్భంగా తైనాల ప్రస్తావించారు. ఈ రూల్ ప్రకారం ఏదైనా పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధులు, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలలో పార్టీ ఆదేశించిన విధంగానే ఓటు వేయాలి. లేని పక్షంలో వారి సభ్యత్వాన్ని రద్దు చేసే పూర్తి హక్కు సంబంధిత పార్టీకి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. పార్టీ నేత పల్లా దుర్గారావు ఆయన వెంట ఉన్నారు.