
కెమికల్‌లో అవకాశాలెన్నో..
మురళీనగర్: కెమికల్ ఇంజనీరింగ్ అనగానే చాలామంది రసాయనాల వాసన, ప్రమాదాలు వంటి అపోహలకు గురవుతుంటారు. తమ పిల్లలను ఈ రంగంలో చేర్పించేందుకు సందేహిస్తుంటారు. మన నిత్య జీవితంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉపయోగించే దాదాపు 179 రకాల వస్తువులు కెమికల్ పరిశ్రమల్లోనే తయారవుతాయంటే ఈ రంగం ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్‌తో అనుబంధం లేని విభాగమే లేదనడంలో అతిశయోక్తి లేదు. చాలామందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒకప్పుడు ఈ రంగంలో పురుషుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా మారాయి. కెమికల్ కంపెనీలలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రమాదాలు లేని సురక్షితమైన వాతావరణం ఏర్పడింది. ఈ మార్పుతో మహిళలు కూడా డిప్లొమా స్థాయి నుంచే కెమికల్ ఇంజనీరింగ్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన బాలికలు సైతం, అబ్బాయిలతో సమానంగా ఉద్యోగాలు సాధిస్తూ తమ సత్తా చాటుతున్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి ఉన్నన్ని ఉపాధి అవకాశాలు మరే ఇతర రంగంలోనూ లేవు. కాబట్టి, ఈ రంగంపై ఉన్న అపోహలను వీడి, అవకాశాలను అందిపుచ్చుకోవడం నేటి యువతకు ఎంతో ముఖ్యం.
ప్రవేశాలు
పదోతరగతి చదివి పాలిసెట్ ద్వారా మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కంచరపాలెం (విశాఖపట్నం) ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగు ఇనిస్టిట్యూట్ (గైస్)లో చేరవచ్చు.
● గుంటూరు మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజీలో 30, కడప జిల్లా మైదకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 60 సీట్లు కేవంల కెమికల్ బ్రాంచిలో మాత్రమే ఉన్నాయి. స్పెషలైజేషన్ బ్రాంచిలున్న కాలేజీ విశాఖ గైస్ మాత్రమే.
కాలపరిమితి: మూడున్నరేళ్లు
ఇండస్ట్రియల్ ట్రైనింగ్
5వ, 6వ సెమిస్టర్లలో ఆరు నెలలు చొప్పున మొత్తం ఏడాది పాటు ఇండస్ట్రియల్ శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో నెలకు రూ.7 వేలు ఉపకార వేతనం బోర్డ్ ఆఫ్ అప్రంటిస్‌షిప్ ట్రైనింగ్ సదరన్ రీజియన్‌న్ (చైన్నె) చెల్లిస్తారు. ప్రముఖ మల్టినేషనల్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. ఇస్రో, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ), హెచ్‌పీసీఎల్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్, ఆంధ్రా పెట్రో కెమికల్స్ లిమిటెడ్, ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్, నాగార్జున ఫెర్టిలైజర్స్, టొయట్సో రేర్ ఎర్‌త్స్ ఇండియా లిమిటెడ్, భెల్, స్టీల్ ప్లాంట్, కోఆపరేటివ్ డెయిరీలో శిక్షణనిస్తారు.
జాతీయ స్థాయి గుర్తింపు : కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీకి ఉత్తమ ప్రమాణాలకు సంబంధించి ఐఎస్‌ఓ 210001, 2018 సర్టిఫికెట్ పొందింది. అంతే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్‌బీఏ గుర్తింపు లభించింది. దీని వల్ల ఇక్కడ చదివే విద్యార్థులకు ఉద్యోగాలు మెండుగా వచ్చే అవకాశం ఉంది.
కోర్సుల వివరాలు
కెమికల్ ఇంజినీరింగ్ డిప్లమాలో నాలుగు విభాగాలు ఉన్నాయి.
1. డిప్లమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్
2. డిప్లమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్
( పెట్రో కెమికల్స్)
3. డిప్లమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్
(ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్)
4. డిప్లమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్
(ఎడిబుల్ ఆయిల్ టెక్నాలజీ)
ప్రతి విభాగంలో 60 సీట్లు ఉంటాయి.
ఇవి కాకుండా అదనంగా 6 సీట్లు ఈడబ్ల్య్లూఎస్‌కు ప్రత్యేకంగా కేటాయించారు.
ఉద్యోగ విజయాలు
ఐదేళ్లలో గైస్‌లో చదివిన 724 మంది విద్యార్థులు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. ఇవి కాకుండా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
2020-21లో..
178 మంది. బాలురు 127మంది, బాలికలు 51మంది. ఆ ఏడాది అత్యధికంగా రూ. 4లక్షలు ప్యాకేజీ
2021-22లో..
105 మందిలో బాలురు 69, బాలికలు 36మంది. అత్యధిక ప్యాకేజీ రూ.4.5లక్షలు
2022-23లో..
165 మందిలో బాలరు 101, బాలికలు 64మంది. అత్యధిక ప్యాకేజీ రూ. 6.6లక్షలు
2023-24లో..
105మందిలో బాలురు 78, బాలికలు 27మంది. అత్యధిక ప్యాకేజీ రూ.7లక్షలు
2024-25లో..
171మందిలో బాలురు 100, బాలికలు 71మంది. అత్యధిక ప్యాకేజీ రూ.10.4లక్షలు
వసతి సదుపాయాలు
కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ (గైస్)లో బాలికలకు ప్రత్యేకంగా వసతీ సదుపాయం ఉంది. బాలురకు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్‌లో వసతి కల్పిస్తారు.
ఉద్యోగావకాశాలు
ప్రభుత్వ, ప్రయివేటు , జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, సంస్థల్లో సూపర్‌వైజర్, జూనియర్ ఇంజినీర్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఆపరేటర్ ట్రైనీస్ పోస్టుల్లో చేరవచ్చు. రైల్వేలో కూడా మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
కెమికల్ ఇంజినీరింగ్‌కు డిమాండు
కెమికల్ ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. విద్యార్థులకు అడమిక్స్‌తోపాటు ప్రయోగాత్మక పరిశీలన, సృజనాత్మక అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఉద్యోగావకాశాల కల్పనకు సంబంధించి ప్లేస్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడంతోపాటు, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలకు పంపిస్తున్నాం. దీని వల్ల వంద శాతం ఉద్యోగ సాధనలో రికార్డు సాధించాం. బాలికలు ఉద్యోగాల సాధనతో ముందంజలో ఉన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రచురించిన బ్రోచర్లలో మా కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు చోటు లభించింది.
–డాక్టర్ కె.వెంకటరమణ, ప్రిన్సిపాల్,
గైస్, కంచరపాలెం
ఈసెట్‌లో ఉత్తమ ర్యాంకులు
కెమికల్ ఇంజినీరింగ్ చదివిన వారికి తక్షణ ఉపాధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం అవసరం లేదనుకునే వారు ఇంజినీరింగ్ సెట్ రాసి నేరుగా ఇంజినీరింగు రెండవ సంవత్సరంలో చేరవచ్చు. ఈ కాలేజీలో ప్రతి ఏడాది మొదటి పది ర్యాంకులు వీరే సాధిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ సెట్‌లో గైస్ విద్యార్థులు తమ హవా కొనసాగిస్తున్నారు.

కెమికల్‌లో అవకాశాలెన్నో..

కెమికల్‌లో అవకాశాలెన్నో..

కెమికల్‌లో అవకాశాలెన్నో..

కెమికల్‌లో అవకాశాలెన్నో..

కెమికల్‌లో అవకాశాలెన్నో..