
దూరవిద్యలో ఏం జరుగుతోంది..?
విశాఖ విద్య: కొత్తవలసలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పరీక్ష కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన డిస్టెన్స్ పరీక్షల్లో వాగ్దేవి కళాశాలలో అవకతవకలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదులతో నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా పరీక్షా కేంద్రాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి మే 8 వరకు జరగనున్న యూజీ, పీజీ పరీక్షలకు ఈ కేంద్రం కేటాయించిన విద్యార్థులు కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే డిస్టెన్స్ విభాగం డిగ్రీ, పీజీ పరీక్షలపై గురువారం కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లతో డిస్టెన్స్ విభాగం డైరెక్టర్ ఆచార్య విజయ్ మోహన్ ఏయూలోని సీడీవోఈ సెమినార్ హాల్లో సమావేశం నిర్వహించారు. దీనికి రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు కూడా హాజరై కేంద్రాల నిర్వాహకులకు క్లాస్ తీసుకున్నారు. పరీక్షల నిర్వహణ తీరు మెరుగుపడకపోతే, లెర్నింగ్ సెంటర్లలో పరీక్ష కేంద్రాలను తప్పించి, ప్రభుత్వ కాలేజీలనే పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేస్తామని హెచ్చరించారు.
అనుకూలమైన వారే అబ్జర్వర్లు
ఏయూ దూర విద్య విభాగం పరిఽధిలో రాష్ట్ర వ్యాప్తంగా 83 కేంద్రాలు ఉండగా, వీటి ద్వారా యూజీ 17,651 మంది, పీజీ 7,557 మంది ప్రవేశాలు పొందారు. వీరందరికీ ఈ నెల 21 నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్‌కాపీయింగ్‌కు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అబ్జర్వర్ల నియామకంలో డిస్టెన్స్ విభాగంలోని ఓ ఉద్యోగి చక్రం తిప్పి, డబ్బులు ముట్టజెప్పిన వారికి కావాల్సిన సెంటర్‌లో నియమించినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపగా డిస్టెన్స్ విభాగంలోని అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
వసూళ్లతో.. మాస్ కాపీయింగ్
ఈ నెల 21 నుంచి జరిగే డిస్టెన్స్ పరీక్షలకు కేంద్రాల ఎంపిక పూర్తయింది. విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా జారీ అయ్యాయి. ఈ దశలో కొత్తవలసలోని వాగ్దేవి కాలేజీ కేంద్రాన్ని రద్దు చేయటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గత సెమిస్టర్ పరీక్షల్లో జరిగిన లోపాలను మరుసటి సెమిస్టర్ పరీక్షలు జరిగేంత వరకు గుర్తించకపోవటం డిస్టెన్స్ విభాగంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. డిస్టెన్స్ విధానంలో డిగ్రీ, పీజీ పరీక్షలు రాసే వారి నుంచి పేపరుకు ఇంత అని డబ్బులు వసూలు చేస్తూ, కొన్ని కేంద్రాల్లో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నందునే.. ఈ రచ్చకు కారణంగా తెలుస్తోంది. ఏయూ పాలనాధికారులు ఇప్పటికై నా డిస్టెన్స్ పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టాలని పలువురు కోరుతున్నారు.
21 నుంచి యూజీ, పీజీ పరీక్షలు
కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు స్కెచ్
అబ్జర్వర్ల నియామకంలోచక్రం తిప్పిన ఉద్యోగి
అవకతవకలపై రిజిస్ట్రార్‌ధనుంజయరావు సీరియస్
వాగ్దేవి దూరవిద్య పరీక్ష కేంద్రం రద్దు