
పోక్సో కేసుల్లో ఎక్కువ మంది యువతే
బీచ్‌రోడ్డు: తెలిసీ తెలియని వయసులో ప్రేమ ఉచ్చులో పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని, యువత ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా వేదికగా విశాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ‘మహిళా రక్షణకు కలిసికట్టుగా’ అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రేమ ముసుగులో యువత బలైపోతోందని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పోక్సో కేసుల్లో 60 శాతం మంది 18–20 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోలన కలిగిస్తోందన్నారు. గంజాయి కేసుల్లో కూడా చాలా మంది చిన్న వయసు వారే ఉన్నారన్నారు. మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమానికి రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖ నుంచి శ్రీకారం చుట్టామని, ఇది మహిళల రక్షణ, ధైర్యానికి ఒక చక్కని వేదిక అవుతుందన్నారు. స్వీయ నియంత్రణ అందరూ అలవాటు చేసుకోవాలన్నారు. మన కోసం నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచించాలని సూచించారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వలనే ఇదంతా జరుగుతోందని, పోక్సో, ఇతర చట్టాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. మత్తు పదార్ధాలు భవిష్యత్‌ను నాశనం చేస్తాయని, వాటికి దూరంగా యువత ఉండాలని సూచించారు. ఏయూ లాంటి విద్యా సంస్థల్లో చదవడం అదృష్టంగా భావించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇలాంటి విద్యా వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా వీసీని నియమించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరినీ హౌస్ అరెస్టులు చేయలేదని గుర్తు చేశారు. తిరుపతిలో ఎవరినీ నిర్బంధించలేదని స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఏయూ వీసీ రాజశేఖర్ యువతకు పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రేమ ఉచ్చులో పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
‘మహిళా రక్షణకు కలిసికట్టుగా’ లో హోం మంత్రి అనిత పిలుపు
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత