మధురవాడ: షాపింగ్, ఇతర ఖర్చుల కోసం భర్త డబ్బులు ఇవ్వలేదని ఓ వివాహిత మేడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పీఎంపాలెం ఎస్‌ఐ భాస్కరరావు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను రక్షించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాలివి.. మధురవాడ సమీపంలోని వైఎస్సార్ జేఎన్‌ఎన్‌యూఆర్ కాలనీ 24వ బ్లాక్ టీఎఫ్–1లో ఒబ్బిన వెంకటరమణ, సూరి దంపతులు నివాసం ఉంటున్నారు. వెంకటరమణ తాపీమేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భార్య సూరి, కుమార్తె షాపింగ్, ఇతర అవసరాల కోసం అతనికి డబ్బులు అడిగారు. అతను కుమార్తెకు డబ్బులు ఇచ్చి భార్యకు ఇవ్వలేదు. దీంతో ఆవేదన చెందిన సూరి మూడవ అంతస్తుపై మేడ మీదకు వెళ్లి.. అక్కడ నుంచి షన్‌షేడ్ మీదకు దిగింది. అక్కడి నుంచి కిందకు దూకేస్తానంటూ కూర్చుంది. దీంతో స్థానికులు పీఎంపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకున్నారు. డబ్బులు ఇప్పిస్తానని మాటల్లో పెట్టి.. మేడపై నుంచి ఆమె చేయి అందుకుని స్థానికుల సహాయంతో పైకి లాగారు. ఎస్‌ఐ భాస్కరావు చాకచక్యంగా వ్యవహరించి.. మహిళను రక్షించిన తీరును స్థానికులు అభినందించారు. భార్యాభర్తలిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి ఎస్‌ఐ కౌన్సెలింగ్ ఇచ్చారు.