సాక్షి, విశాఖపట్నం : లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన వాల్తేరు పూర్వ డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ ఎట్టకేలకు విశాఖలోని తన నివాసాన్ని ఖాళీ చేశారు. గతేడాది నవంబర్‌లో ముంబయిలోని ఓ కాంట్రాక్టు సంస్థకు చెందిన వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటూ సౌరభ్‌కుమార్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. రూ.25 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించడంతో పుణేలో లంచం తీసుకుంటూ కేంద్ర దర్యాప్తు సంస్థకు రెడ్ హ్యాండెడ్‌గా సౌరభ్‌కుమార్ దొరికిపోయారు. అప్పటి నుంచి సీబీఐ జైలులోనే సౌరభ్‌కుమార్ ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. చివరికి సొంత పూచీకత్తుతో గత నెల 28న బెయిల్ మంజూరు చేసింది. తాజాగా.. లలిత్ బోరా డీఆర్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నివాస గృహం అవసరమైంది. అయితే గత డీఆర్‌ఎం ఖాళీ చేయకపోవడంతో గెస్ట్‌హౌస్‌లో నివాసముంటున్నారు. రైల్వే బోర్డు ఆదేశించడంతో సౌరభ్‌కుమార్ ఎట్టకేలకు గురవారం సాయంత్రం డీఆర్‌ఎం బంగ్లాను ఖాళీ చేశారు. బంగ్లాలో ఉన్న తన ఇంటి సామగ్రిని తీసుకువెళ్లినట్లు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు.