విశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫిబ్రవరి నెలలో 73 చోరీ కేసులను ఛేదించి 103 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను ప్రదర్శించి రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చోరీ కేసుల్లో నిందితుల నుంచి మొత్తంగా రూ.93,21,435 విలువైన నగదు, బంగారం, వెండి, మొబైల్స్, వాహనాలను రికవరీ చేసినట్లు చెప్పారు. ఇందులో 660.655 గ్రాముల బంగారం, 2,008.3 గ్రాముల వెండి, రూ.2,73,575 నగదు, 14 బైక్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, 419 మొబైల్ ఫోన్లు ఇలా మొత్తంగా రూ.93,21,435 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని వివరించారు. గత నెలలో నగరంలో 751 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 203 నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. అలాగే నేరాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా పెట్టినట్లు తెలిపారు. అనంతరం ఆభరణాలు, బైక్‌లు, ఇతర వస్తువులను వాటి యజమానులకు సీపీ చేతుల మీదుగా అందజేశారు.
73 చోరీ కేసుల్లో రూ.93.21 లక్షలు రికవరీ