● ఆమె తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ ● ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ నాయకులతో కలిసి ఆందోళన
తాటిచెట్లపాలెం: దొండపర్తిలోని రైల్వే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల చిన్నారి హన్విక మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిని నిరసిస్తూ చిన్నారి బంధువులు, యూనియన్ నాయకులు రైల్వే ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాలివి.. వాల్తేరు డివిజన్, ఇంజినీరింగ్ విభాగంలో ట్రాక్ మెయింటైనర్‌గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరావు కుమార్తె హన్విక బుధవారం ఉదయం తీవ్రమైన కడుపు నొప్పికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు రైల్వే ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారిని మొదట క్యాజువాలిటీకి తీసుకెళ్లగా.. అక్కడ సిబ్బంది ఓపీకి వెళ్లమని సూచించారు. ఓపీ వద్ద వేచి ఉన్న సమయంలో నొప్పి తీవ్రం కావడంతో మళ్లీ క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అక్కడ పాపను వార్డులోకి పంపి ఇంజక్షన్లు చేసినప్పటికీ సరైన చికిత్స అందించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి పాప తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా.. వైద్య సిబ్బంది పట్టించుకోలేదని వాపోయారు. ఉదయం చిన్న పరీక్షలు చేసి పల్స్, హార్ట్ బీట్ ఆగిపోయిన తర్వాత మెడికవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లిన అనంతరం వైద్యులు పాప మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన చిన్నారి బంధువులు, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ నాయకులు చిన్నారి మృతదేహంతో రైల్వే ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా యూనియన్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది.