బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

బరితెగింపు

Mar 20 2025 1:23 AM | Updated on Mar 20 2025 1:17 AM

అభివృద్ధిని విస్మరించి

డాబాగార్డెన్స్‌/మధురవాడ/కొమ్మాది/ తగరపువలస: మంచితనానికి మారుపేరు.. మానవత్వానికి ప్రతిరూపం.. చిరునవ్వుకు చిరునామా.. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఆయన పేరును పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నుంచి కూటమి ప్రభుత్వం తొలగించింది. ఇది పూర్తిగా కక్షపూరిత చర్యేనని క్రీడాకారులు, క్రీడాభిమానులు, వైఎస్సార్‌ అభిమానులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి వైఎస్సార్‌ చేసిన కృషి ఎనలేనిది. మధురవాడ నేడు అభివృద్ధిలో దూసుకుపోతుందంటే అందుకు ప్రధాన కారణం వైఎస్సార్‌. ఈ క్రికెట్‌ స్టేడియానికి అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి గొప్ప నాయకుడి పేరును రాత్రికి రాత్రే తొలగించడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్‌ అభిమానులు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి నేతలు బీచ్‌రోడ్డులోని వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌ను ధ్వంసం చేశారు. నగరంలో పలు చోట్ల ఆయన విగ్రహాలను తొలగించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన పేరు లేకుండా చేశారు. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం పేరును మార్చి వికృతానందం పొందుతున్నారు.

మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి, విశాఖకు చేసిన సేవలకు గుర్తింపుగా 2009 సెప్టెంబర్‌ 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంగా పేరు పెట్టారు. ఆనాడు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జీవీఎంసీ కౌన్సిల్‌లో సభ్యులందరి అభిప్రాయం మేరకు తీర్మానం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు జీవీఎంసీ కౌన్సిల్‌ దృష్టికి తీసుకురాకుండా, సభ్యులకు కనీసం తెలియజేయకుండా స్టేడియం పేరును ఎలా తొలగిస్తారంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలో జరిగే కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు పట్టుబడతామని పలువురు కార్పొరేటర్లు హెచ్చరించారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కేవలం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వెంటనే వైఎస్సార్‌ పేరును స్టేడియంకు జత చేయాలని డిమాండ్‌ చేశారు.

విశాఖపై వైఎస్సార్‌ ముద్ర

నగరంలో మంచినీటి సమస్య పరిష్కారం, నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను గట్టెక్కించి రెండో దశను విస్తరించడం, భారత్‌ హెవీ ప్లేట్స్‌ అండ్‌ వెసల్స్‌(బీహెచ్‌పీవీ)ని భెల్‌లో విలీనం చేయడం, షిప్‌యార్డును రక్షణ శాఖలో విలీనం చేసి పునరుజ్జీవం కల్పించడం. ఇలా ఎన్నో ప్రధాన సమస్యలను పరిష్కారం చూసిన దార్శినికుడు వైఎస్సార్‌. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వెళ్లకుండా విశాఖలో ఐటీ సెజ్‌కు శ్రీకారం చుట్టారు. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను 2005 నవంబర్‌ 22న మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా గ్రేటర్‌ హోదాని కల్పించారు. ఆయన చొరవతోనే జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలో భాగంగా రూ.1885 కోట్ల విలువైన పనులు విశాఖ నగరానికి దక్కాయి. సెంట్రల్‌ సిటీలో రూ.244 కోట్లతో 750 కిమీ మేర యూజీడీ పనులు చేపట్టారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలకు హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో అత్యుత్తమ సేవలు అందించేందుకు విమ్స్‌కు 2006లో శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్న సంకల్పంతోనే పోలవరం ఎడమ కాలువను నిర్మించారు. ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్‌ విస్తరణకూ రాజశేఖరరెడ్డి పునాదులు వేశారు. ఎండాడ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.23 కోట్లు.. విశాఖ నగర దాహార్తిని తీర్చేందుకు తాటిపూడి నుంచి నగరానికి రూ.95 కోట్లతో పైపులైన్‌ ఏర్పాటు చేశారు. ఆశీల్‌మెట్ట నుంచి రైల్వేస్టేషన్‌ వరకు రూ.87 కోట్లతో నగరంలో తొలి ఫ్లైఓవర్‌ నిర్మించారు. పట్టణ పేదలకు గృహయోగం కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో.. ఇంకెన్నో..

విశాఖ స్టేడియం పేరు మార్పుపై

వైఎస్సార్‌ అభిమానుల ఆగ్రహం

వెంటనే జతచేయాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement