పరవాడ: విజయవాడలోని సీఐపీఈటీ సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం కల్పిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఈడీ సమీర్‌శర్మ కోరారు. విజయవాడలోని సీఐపీఈటీని ఈడీ సమీర్‌శర్మ, సంస్థ అధికారులు మంగళవారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న నిరుద్యోగులను కలిసి, వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈడీ సమీర్ శర్మ మాట్లాడుతూ సీఐపీఈటీ సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ శతశాతం ఉద్యోగ నియామక హామీపై మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, మెషిన్ ఆపరేటర్–ఇంజెక్షన్ మోల్డింగ్‌లో ఆరు నెలల శిక్షణ అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లలో 120 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించామన్నారు. ప్రస్తుతం మరో 60 మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు.