ఆచార్య.. ఫలితాలెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

ఆచార్య.. ఫలితాలెప్పుడు?

Mar 17 2025 9:41 AM | Updated on Mar 17 2025 10:29 AM

ఆచార్య.. ఫలితాలెప్పుడు?

ఆచార్య.. ఫలితాలెప్పుడు?

● ఏయూ రంగస్థల విభాగంలో వింత పోకడలు ● పరీక్షలు పూర్తయి ఐదు నెలలైనా ఫలితాల విడుదలలో జాప్యం ● తెర వెనుక వివాదాలే కారణమా?

విశాఖ విద్య: యూనివర్సిటీల్లో పరీక్షలు పూర్తయిన రెండు నెలల్లో ఫలితాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. పరీక్షల విభాగంపై వర్సిటీ పాలనాధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న రంగస్థల విభాగం (థియేటర్‌ ఆర్ట్స్‌) పరీక్ష ఫలితాల్లో మితిమీరిన జాప్యం నెలకొంది. ఇక్కడ పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్‌ ఆచార్యుల మధ్య నెలకొన్న మనస్పర్థలతో ఆ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ప్రచారం ఉంది. గతేడాది నవంబర్‌లో జరిగిన డిప్లమో యాక్టింగ్‌, డైరెక్షన్‌ ఆఖరి ఏడాది పరీక్ష ఫలితాలు మార్చి గడుస్తున్నా ఇంకా ప్రకటించలేదు. విద్యార్థులు రాసిన జవాబుపత్రాలు రంగస్థల విభాగానికి ఎప్పుడో చేరినా.. వాటిని మూల్యాంకనం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

‘రంగస్థలం’కు పునరుజ్జీవం

ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాటకరంగానికి పుట్టినిల్లుగానే చెబుతారు. అందుకనే ఆంధ్ర యూనివర్సిటీలో నటన, దర్శకత్వం కోర్సుల నిర్వహణకు ప్రత్యేకంగా థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగం ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ నిర్వహించే నటన, దర్శకత్వంలో ఒక్కో కోర్సులో 20 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే రెండేళ్లుగా అడ్మిషన్లు చేపట్టలేదు. దీనికి పునరుజ్జీవం పోసేలా విభాగాధిపతి నరసింహారావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ విద్యా సంవత్సరంలో మళ్లీ కోర్సుల నిర్వహణ ప్రారంభమైంది. రంగస్థల విభాగం ప్రాధాన్యం దృష్ట్యా కోర్సుల నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా అవసరమైన నిధులు సైతం కేటాయిస్తున్నారు. రెగ్యులర్‌ పోస్టుల భర్తీ లేకపోవడంతో ఇద్దరు కాంట్రాక్టు ఆచార్యులు, మిగతా అన్ని సబ్జెక్టులకు సరిపడే గెస్ట్‌ ఫ్యాకల్టీలను నియమించారు.

ఆచార్యుల తీరు మారాల్సిందే..

రంగస్థల విభాగంలో అత్యధిక మార్కులతో ప్రతిభ సాధించిన విద్యార్థులకు స్నాతకోత్సవంలో బంగారు పతకాలు బహూకరిస్తారు. వీటిని ఎవరికి ఇవ్వాలనేది ఆచార్యులకే సర్వాధికారాలు ఉంటాయి. విద్యార్థుల్లో నటన, సృజనాత్మక ప్రతిభను అంచనా వేయడం చాలా అవసరం. వాటిని బట్టి అంతర్గత, ప్రయోగ సామర్థ్యాలకు మార్కులు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారు పతకం మీకే ఇస్తామంటూ విద్యార్థులతో ఇక్కడి ఆచార్యులు బేరసారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాలతోనే గతంలో ఒక అధ్యాపకుడు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడి రంగస్థల విభాగానికి మచ్చ తెచ్చిపెట్టారు. అయినా ఇక్కడి ఆచార్యుల్లో మార్పు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అడ్మిషన్లు ఆలస్యం వల్లే..

రంగస్థల విభాగంలో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కాస్తా ఆలస్యమైంది. మూల్యాంకనం పూర్తి చేసేలా దృష్టి సారిస్తాం. కాంట్రాక్టు ఆచార్యులతో పాటు, మూల్యాంకనం కోసం రిటైర్డ్‌ ఆచార్యులను కూడా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ఫలితాలు ప్రకటిస్తాం.

– ఆచార్య నరసింహారావు,

థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగాధిపతి

పరీక్షల విభాగం ఏం చేస్తున్నట్లో?

పరీక్షల నిర్వహణ, వాటికి సకాలంలో మూల్యాంకనం చేయించి, ఫలితాలు విడుదల చేయడం వర్సిటీలోని పరీక్షల విభాగం (కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌) బాధ్యత. కానీ ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల విభాగం మొద్దు నిద్రపోతున్నట్లుగా ఉంది. రంగస్థల విభాగంలో పరీక్షలు నిర్వహించి ఐదు నెలలు కావస్తున్నా ఫలితాలు విడుదల చేయాలనే ధ్యాస లేకపోవడం వారి పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిణామాలతో ఫలితాల కోసమని రంగస్థలం కోర్సు అభ్యసించిన విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement