
అట్టహాసంగా జాతీయ నాటకోత్సవాలు ప్రారంభం
మురళీనగర్: కేవీ మెమోరియల్ ఆర్ట్స్, విశాఖ పోర్ట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మురళీనగర్ వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ సంయుక్త ఆధ్వర్యంలో మురళీనగర్‌లోని వేములపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జాతీయస్థాయి ఆహ్వాన నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రదర్శించిన నాటికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారాలు పొందిన రంగస్థల నటులు తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముందుగా గుంటూరు అభినయ ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘ఇంద్రప్రస్థం’యువతను ఆలోచింపజేసింది. నేటి యువత జీవితంలో స్థిరత్వం లేకుండా ప్రేమ, పెళ్లి మోజులో పడటం, అనంతరం జీవితంలో వారికి ఎదురయ్యే పరిణామాలు, వారి కష్టాలను కళ్లకు కట్టినట్లు నటీనటులు ప్రదర్శించారు. ‘వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి అందరూ డబ్బు మోజులో సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగాల్లోకి వెళ్లిపోతే రానున్న కాలంలో రైతులనేవారు కనిపించరు. దీని వల్ల తిండి కొరత ఏర్పడితే మానవ మనుగడ పరిస్థితి ఏమిటి?’అనే సందేశాత్మక అంశంతో చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ నటులు‘మా ఇంట్లో మహా భారతం’ నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్ బోగీల్లో ఉన్న ప్రయాణికుల గురించి ఎవరూ పట్టించుకోరు. ఒక రైలు ప్రమాదం సమయంలో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న తన కొడుకు ఆచూకీ తెలియక ఒక తల్లి అనుభవించే ఆవేదనను తెలిపే ‘జనరల్ బోగీలు’ నాటికను కొలకలూరు సాయి ఆర్ట్స్ బృందం ప్రదర్శించింది. పార్కు అధ్యక్ష, కార్యదర్శులు సనపల వరప్రసాద్, పి.వెంకట సూర్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాకర్స్ డిస్ట్రిక్ట్–101 ఆర్‌సీ–5 యు. శుభ, వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు పల్లా చంద్రమౌళి సహకరించారు. శనివారం సాయంత్రం 6.15కు ఒంగోలు పండు క్రియేషన్స్ వారిచే ‘పక్కింటి మొగుడు’, రాత్రి 8.15 గంటలకు విశాఖ జాస్మిన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ మహిళలచే ‘సంకల్పం’ నాటికల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.