● కలెక్టర్ హరేందిర ప్రసాద్
ఏయూక్యాంపస్: అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ అన్నారు. ప్రపంచ కిడ్నీ డే పురస్కరించుకుని జీవన్‌దాన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం బీచ్‌రోడ్డులో అవయవదాన అవగాహన నడక జరిగింది. ఈ సందర్భంగా కాళీమాత ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎక్కువగా కూర్చోవడం, మూత్ర విసర్జనకు సకాలంలో వెళ్లకపోవడం వంటివి మానుకోవాలని హితవు పలికారు. దీర్ఘ కాలంలో ఇవి సమస్యలకు కారణాలుగా మారుతాయన్నారు. మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతేడాది 210 మందికి అవయవాలు మార్పిడి చేశారని, ప్రస్తుతం జిల్లాలో 4,312 మంది అవయవాల కోసం నమోదు చేసుకున్నట్లు తెలిపారు. జీవనశైలిలో మార్పులతోనే చక్కని ఆరోగ్యం సాధ్యమని సూచించారు. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధ వ్యాధులు పెరగడం ఆందోళనకరమన్నారు. బ్రెయిడ్ డెడ్ అయిన వ్యక్తి దానం చేసే అవయవాలు మరొక ఎనిమంది మందికి ప్రాణదానంగా నిలుస్తాయన్నారు. అవయవదానంపై ప్రతీ ఆస్పత్రి బయట ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. జీవన్‌దాన్ రాష్ట్ర ఇన్‌చార్జి డాక్టర్ కె.రాంబాబు మాట్లాడుతూ కిడ్నీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలిని కలిగి ఉండాలన్నారు. రెండున్నర నెలల కాలంలో 54 అవయవాలు మార్పిడి చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్య, నర్సింగ్ విద్యార్థులు, వివిధ ఆస్పత్రుల సిబ్బందితో కలిసి కలెక్టర్, సీపీ తదితరులు నడిచారు.