విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లను గురువారం ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హాస్టళ్లలో భోజనం సరిగా పెట్టడం లేదని, ఇతర సమస్యలపై బుధవారం రాత్రి విద్యార్థులు ఖాళీ కంచాలతో ఏయూ ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టడంతో అధికారుల్లో చలనం వచ్చింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆచార్య రాజశేఖర్ హాస్టళ్లను పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల భోజన శాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటం గమనించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో కలసి అక్కడే అల్ఫాహారం తీసుకున్నారు. భోజన నాణ్యత, మెనూ అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాష్ బేసిన్‌కు వెళ్లే మార్గాన్ని తరచూ శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భోజనశాలలో కుర్చీలు కొన్ని చోట్ల విరిగి ఉండటాన్ని గమనించి, వెంటనే మార్పు చేయాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను మెరుగుపరచడంలో, పర్యవేక్షణలో విద్యార్థులను భాగస్వాములు చేస్తామని, ఇందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని వీసీ స్పష్టం చేశారు. హాస్టల్ మెస్‌లపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని విద్యార్థులకు హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన సమయంలో వీసీ మరో మెస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, భోజన నాణ్యతను పరిశీలించారు. సాయంత్రం అకడమిక్ సెనేట్ మందిరంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. హాస్టల్లో ఉన్న సమస్యలపై సమగ్ర వివరాలు తీసుకున్నారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం డిస్పెన్సరీని తనిఖీ చేసి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు.
అసంతృప్తి వ్యక్తం చేసిన ఏయూ వీసీ
క్యాంపస్ హాస్టళ్ల ఆకస్మిక తనిఖీ