● భోజనం కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
● మెయిన్ గేట్ వద్ద ఖాళీ కంచాలతో నిరసన
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం రాత్రి రోడ్డెక్కారు. హాస్టళ్లలో సరిగా భోజనం పెట్టడటం లేదంటూ వర్సిటీ ప్రధాన గేటు ముందు భైఠాయించి ఖాళీ కంచాలతో నిరసన తెలిపారు. తమ గోడు పట్టించుకోని వర్సిటీ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం’ అంటూ నినదిస్తూ ఖాళీ కంచాలను నేలపై కొడుతూ తమ ఆకలి బాధను తీర్చాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ హాస్టళ్లలో భోజనం సరిగా పెట్టడం లేదని కొన్ని రోజుల క్రితం విద్యార్థులు వీసీ భవనం ముందు నిరసన చేపట్టారు. విద్యార్థులు, వర్సిటీ ఆచార్యులతో కమిటీ ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలోనే హాస్టళ్ల నిర్వహణ సాగేలా చూస్తామని వీసీ, రిజిస్ట్రార్ చెప్పడంతో అప్పట్లో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు. మళ్లీ వారం రోజులు తిరిగేసరికి వర్సిటీ అధికారుల మాటల బుట్టదాఖలు చేస్తూ, హాస్టళ్ల అధికారులు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ.. తమను ఖాళీ కడుపుతో ఉండేలా చేస్తున్నారని విద్యార్థులు వర్సిటీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు.
పురుగులు ఉన్నాయన్నా
పట్టించుకోలేదు
బుధవారం మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు హాస్టళ్ల నిర్వాహకులకు తెలిపారు. దీనిపై ఎవరూ పట్టించుకోకపోగా రాత్రి భోజనం కూడా పరిశుభ్రత లేకుండా వండిపెట్టారు. దీంతో విద్యార్థులు రాత్రి భోజనాలు తినడటం మానేసి.. ఖాళీ కంచాలతో హాస్టళ్ల నుంచి నినాదాలు చేసుకుంటూ వర్సిటీ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటకీ తమ బాధను అర్థం చేసుకోవాలని కోరుతూ విద్యార్థులంతా ప్రధాన గేట్లు మూసేసి రోడ్డుపై భైఠాయించారు. వర్సిటీ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఈస్ట్ డివిజన్ ఏసీపీ లక్ష్మణమూర్తి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఏయూకు చేరుకున్నారు. విద్యార్థులతో వారు మాట్లాడే ప్రయత్నం చేయగా మధ్యాహ్నం పురుగులతో కూడిన అన్నం పెట్టినట్లుగా తమ సెల్‌ఫోన్లలో తీసిన ఫొటోలు, వీడియోలను పోలీసు అధికారులకు చూపించడంతో వారు మిన్నుకుండిపోవాల్సి వచ్చింది.
ప్రభుత్వానికి విద్యార్థుల బాధలు పట్టవా..?:
వర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల విద్యార్థులు అర్ధాకలితో అలమటించే పరిస్థితులు దాపురించాయని, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ లేవని ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి వెంకటరమణ అన్నారు. ప్రభుత్వం తమ బాధలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కాలర్‌షిప్పులు మంజూరు కాకపోవటంతో తమపైనే హాస్టళ్ల నిర్వహణ భారం వేస్తున్నారని, చివరకు సిబ్బంది జీతాలకు చెల్లించాల్సిన డబ్బులను కూడా విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నారన్నారు. తమ బాధలను ప్రభుత్వానికి తెలియజేయాలనే నిరసన చేపట్టామన్నారు. విద్యార్థుల ఆందోళన రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగింది.
ఏయూలో ఆకలి కేకలు..!
ఏయూలో ఆకలి కేకలు..!