పద్మనాభం: అనంతుని కల్యాణోత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన బుధవారం అనంతుని తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. కుంతీ మాధవ స్వామి కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహాలను హంస వాహనంపై ఊరేగింపుగా పద్మనాభం జంక్షన్‌కు సమీపంలో ఉన్న అనంతుని పుష్కరిణి వద్దకు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలు, నాద మునీశ్వరు స్వరాల నడుమ తొడ్కొని వచ్చారు. ఇక్కడ కోనేరు గట్టుపై విశ్వేక్షణ పూజ, పుణ్యాహ వచనం నిర్వహించారు. తదుపరి ఉభయ దేవేరులతో అనంత పద్మనాభ స్వామి హంస వాహనంపై ఆశీనులు అయ్యారు. నెల్లిమర్ల శ్రీదుర్గ మహా పీఠం పీఠాధిపతి శ్రవణ చైతన్యానంద చిన్న స్వామి ప్రవచనాలు అనంతరం తెప్పోత్సవం మొదలైంది. స్వామి మూడు సార్లు పుష్కరిణిలో హంస వాహనంపై విహరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ భీమునిపట్నం నియోజకవర్గ సమన్వయ కర్త మజ్జి రశ్రీనివాసరావు(చిన్నశ్రీను), ఎంపీపీ కంటుబోతు రాంబాబు, ఈవో నానాజీ బాబు, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ, తాలాడ పద్మనాభం, కంటుబోతు ఎర్నాయుడు, కాళ్ల నగేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులివేషాలు, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారీ బాణసంచా కాల్చారు.
కనుల పండువగా అనంతుని తెప్పోత్సవం