ఆరిలోవ: జూలో రేచు కుక్కల సంతతి పెరుగుతోంది. ప్రస్తుతం వీటి సంఖ్య 56కు చేరింది. ఏటా జనవరి నుంచి మార్చి వరకు రేచు కుక్కల పునరుత్పత్తికి అనుకూలమైన సమయం. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇంత వరకు జూలో మూడు ఆడ అడవి కుక్కలకు 16 పిల్లలు పుట్టినట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఇవి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. పునరుత్పత్తి కేంద్రంలో పిల్లలు తల్లి కుక్కలతో కలిసి హుషారుగా తిరుగుతున్నాయన్నారు. జంతు మార్పిడి విధానంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇతర జూ పార్కుల నుంచి వన్యప్రాణులను విశాఖ జూకి తీసుకువచ్చినప్పుడు వీటిలో కొన్నింటిని ఆయా జూ పార్కులకు తరలిస్తున్నారు.