డిగ్రీ ప్రవేషాలు | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ ప్రవేషాలు

Mar 12 2025 7:20 AM | Updated on Mar 12 2025 7:17 AM

● అఫిలియేషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌రాకముందే అడ్మిషన్ల వేట ● ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు శూన్యం ● ఇతర రాష్ట్రాల బోర్డు సర్టిఫికెట్లకు జెన్యూనిటీ ఎంత? ● కాలేజీల నిర్వహణపై దృష్టి పెట్టని ఏయూ

విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు అప్పుడే అడ్మిషన్ల వేట మొదలుపెట్టారు. ‘మా కళాశాలలో చేరితే ఫీజు రాయితీ, ప్లేస్‌మెంట్‌ గ్యారెంటీ’ అంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లను చేతుల్లో పెట్టి విద్యార్థులకు వల వేస్తున్నారు. విశాఖ నగరంలోని ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ఈ హడావిడి కనిపిస్తోంది. ఉన్నత విద్యా మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకముందే 2025–26 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేస్తుండటం గమనార్హం. దీని వెనుక కూటమి ప్రభుత్వంలోని పెద్దలతో అంటకాగే ఆంధ్ర యూనివర్సిటీలోని కొంతమంది అధికారుల ప్రమేయం ఉందనే ప్రచారం సాగుతోంది. వర్సిటీ నుంచి అఫిలియేషన్‌ వచ్చేలా తాము చూసుకుంటామని భరోసా ఇస్తుండటంతోనే ప్రైవేట్‌ కళాశాలల నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఏటా 25 వేల మందికి పైగానే డిగ్రీలో చేరిక

ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్‌తో ఉమ్మడి విశాఖ జిల్లాలో 196 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 38 కళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సులు కలిపి ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. వీటిలో ఏటా డిగ్రీ మొదటి సంవత్సరంలో 25 వేల మందికి పైగానే విద్యార్థులు చేరుతుంటారు. ఈ కళాశాలల నిర్వహణకు ఏటా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్‌ (గుర్తింపు) ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్‌ ప్రవేశాల వెబ్‌సైట్‌లో వర్సిటీ అఫిలియేషన్‌ పొందిన కళాశాలల జాబితానే పెడతారు.

ఇతర రాష్ట్రాల బోర్డు సర్టిఫికెట్లపై పరిశీలన నిల్‌

ఉద్యోగ, ఉపాధి, వ్యాపార పరమైన వ్యవహారాలతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నగరంలో స్థిరపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు చెందిన బోర్డులు జారీ చేసే సర్టిఫికెట్లతో ఇక్కడ డిగ్రీలో ప్రవేశాలు పొందుతున్నారు. అయితే వీటిలో జెన్యూనిటీ ఎంత అనేది పరిశీలన లేకపోవడంతో కొన్ని కళాశాలల్లో నకిలీ సర్టిఫికెట్లతో డిగ్రీ అడ్మిషన్లు పొందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ద్వారకానగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పటికీ కళాశాల యాజమాన్యం వీటిని తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారులు ఇలాంటి వాటితో తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో కొంతమంది ఏజెంట్లు ఇతర రాష్ట్రాల బోర్డుల్లో ఓపెన్‌ విధానంలో చదివినట్లు విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అఫిలియేషన్‌ ఇవ్వడమే మా పని

ప్రైవేట్‌ కాలేజీల నిర్వహణకు అఫిలియేషన్‌ ఇవ్వడమే యూనివర్సిటీ పని. మిగతా వ్యవహారాలన్నీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జరుగుతుంది. డిగ్రీలో చేరే విద్యార్థులు సమర్పించే సర్టిఫికెట్లు జెన్యూనిటీ పరిశీలన కూడా కాలేజీల వారే చూసుకోవాలి.

– ఆచార్య టి.వి.కృష్ణ, ఆంధ్రా యూనివర్సిటీ సీడీసీ డీన్‌

ప్రైవేట్‌ కళాశాలలపై తనిఖీలేవీ.?

ప్రైవేట్‌ కళాశాలల నిర్వహణకు అనువైన భవనాలు, తరగతి గదులు, అర్హత గల అధ్యాపకులు, ఆటస్థలం, లైబ్రరీ, సైన్స్‌ ప్రయోగశాలలు, పార్కింగ్‌ ప్రదేశం ఉండాలి. పోలీసు, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖల నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సవ్యంగా ఉన్నాయా లేదా అనేది వర్సిటీ నుంచి వెళ్లే బృందం తనిఖీ చేసి నిజనిర్ధారణ నివేదిక ఇచ్చిన తర్వాతనే అఫిలియేషన్‌ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వర్సిటీలోని కాలేజీ డెవలప్‌మెంట్‌ కమిటీ (సీడీసీ) పర్యవేక్షిస్తుంది. అయితే కళాశాలల తనిఖీలు సవ్యంగా జరగడం లేదు. దీంతో నగరంలోని కొన్ని కళాశాలల్లో కనీస వసతులు, అర్హత గల అధ్యాపకులు లేకుండానే చదువులు సాగుతున్నాయి.

డిగ్రీ ప్రవేషాలు1
1/1

డిగ్రీ ప్రవేషాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement