విశాఖ లీగల్ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏడు జిల్లాల(శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ) న్యాయవాదులతో ఒక సదస్సును ఏర్పాటు చేసి.. మద్దతు కూడగట్టామని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర నేతల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఈ ఆరు జిల్లాల ప్రజాభిష్టాన్ని వివరించనున్నట్లు తెలిపారు. హైకోర్టు బెంచ్ కోసం తాము చేస్తున్న కార్యక్రమాలకు అన్ని వర్గాలు సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.