
మాట్లాడుతున్న గౌరవ అధ్యక్షుడు రాఘవేంద్రరెడ్డి
సీతంపేట: విశాఖ అక్రిడిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం పౌరగ్రంథాలయంలో అవగాహన సదస్సు జరిగింది. సొసైటీ గౌరవ అధ్యక్షులు కె.జి.రాఘవేంద్రరెడ్డి, జి.జనార్ధనరావు, అధ్యక్షుడు బి.రవికాంత్, కార్యదర్శి యర్రా శ్రీనివాస్‌లు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. సమాచార పౌర సంబంధాల శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఎలా పూరించాలో పవర్ పాయింట్ ద్వారా వివరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులపై సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ విడుదల చేసిన జీవోను సవరించాల్సి న అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. జీవో నంబర్ 535/2023లో కొన్ని నిబంధనలు కారణంగా అత్యధిక శాతం మంది జర్నలిస్టులు ఎటువంటి లబ్ధి పొందలేరని ఆవేదన వ్యక్తం చేశా రు. జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అందరికీ అనువుగా 90:10 నిష్పత్తిలో చెల్లించేలా నిర్ణయం ఉండాలని, భార్య/భర్త పేరున ఇళ్ల స్థలం, ఫ్లాట్, ఇల్లు ఉంటే అనర్హులనే నిబంధనను తొలగించేలా కృషి చేయాలని కోరారు. జగనన్న కాలనీల్లో గానీ, టిడ్కో ఇళ్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకుంటే.. జర్నలిస్టు ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించేలా సవరణ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 నిబంధన అమలులో ఉన్నందున అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులకు మైదాన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సొసైటీ సహాయ కార్యదర్శి ఎం.చిట్టిబాబు, బందరు శివప్రసాద్, అనురాధ, ఉపాధ్యక్షులు కొయిలాడ పరశురాం, మురళీకృష్ణారెడ్డి, కోశాధికారి ఆలపాటి శరత్‌కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొప్పన రమేష్, కార్యవర్గ సభ్యులు బి.శ్రీనివాసరావు, పాలికి రవికుమార్, టి.లక్ష్మణరావు, విజయలక్ష్మి పాల్గొన్నారు.