
ఏఆర్సీలో ఎలుగుబంటి..
ఆరిలోవ : వియనగరం జిల్లా గజపతినగరం మండలం పంటపొలాల్లో సంచరించిన మగ ఎలుగుబంటిని సోమవారం అర్ధరాత్రి విశాఖ జూ పార్కు సిబ్బంది జంతు పునరావాస కేంద్రానికి తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. గజపతినగరం మండలంలో సంచరించిన విషయం అక్కడ అటవీశాఖ అధికారులు ద్వారా అదేరోజు సమాచారం తెలుసుకున్నామన్నారు. దీంతో జూ వైద్యుడు డాక్టర్ ఫణీంద్ర, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఎలుగుబంటిని చాకచక్యంగా పట్టుకొన్నారన్నారు. బోనులో బంధించి అక్కడ నుంచి ప్రత్యేక వ్యానులో ఏఆర్సీకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దాని శరీరంపై స్వల్ప గాయాలుండటంతో ప్రస్తుతం ఏఆర్సీలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.