మోత మోగలేదు. హారన్‌ కొట్టలేదు.. విజిల్‌ వినిపించలేదు.. | - | Sakshi
Sakshi News home page

మోత మోగలేదు. హారన్‌ కొట్టలేదు.. విజిల్‌ వినిపించలేదు..

Oct 1 2023 12:56 AM | Updated on Oct 1 2023 9:41 AM

- - Sakshi

చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా.. కంచాలు కొట్టండి.. విజిల్స్‌ వేయండి అంటూ పిలుపులివ్వడం

సాక్షి, విశాఖపట్నం: మోత మోగలేదు. హారన్‌ కొట్టలేదు.. విజిల్‌ వినిపించలేదు.. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు మద్దతుగా మోత మోగించాలంటూ టీడీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన కరువైంది. పార్టీ ఆఫీస్‌లో మినహా.. ఉమ్మడి జిల్లాలోని టీడీపీ శ్రేణులు తమకెందుకొచ్చిన తలనొప్పి అంటూ తప్పించుకున్నా రు. పార్టీ ఉంటుందా లేదా అనే సందేహంలో ఉన్న తరుణంలో ఇలాంటి పిచ్చి పిలుపులేంటంటూ నేత లు.. కార్యకర్తలతో చెప్పి అసహనం వ్యక్తం చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అరెస్టు అంశాన్ని జనాల్లో నానుతూ ఉండేలా చేయాలని టీడీపీ ఎంత ప్రయత్నిస్తున్నా.. అన్ని ఫెయిల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుగా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్వచ్ఛందంగా కంచాలు మోగించాలనీ, ఎక్కడ ఉంటే అక్కడ హారన్లు కొట్టాలనీ, విజిల్స్‌ వేస్తూ మోత మోగించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలోనూ విజయవంతం చేయాలంటూ టీడీపీ సీనియర్‌ నేతలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

కానీ.. ఏ ఒక్కరూ దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా.. కంచాలు కొట్టండి.. విజిల్స్‌ వేయండి అంటూ పిలుపులివ్వడం ఏంటని కొందరు పార్టీ సీనియర్‌ నేతలపైనే వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించడంతో చేసేది లేక.. టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయినా స్పందన కరువైంది. సిటీ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల నుంచి కనీసం 100 మంది కూడా దీనికి హాజరుకాలేదు. ప్రధాన నేతలు, ఎమ్మెల్యేలెవ్వరూ ఇందులో పాల్గొన లేదు.

కేవలం కార్యకర్తలు మాత్రమే పక్కనున్న ఇంటికి కూడా వినిపించనంతగా మోత మోగించడం విశేషం. అటు అనకాపల్లి, అల్లూరి జిల్లాలోనూ టీడీపీ నేతలు మోత మోగించేందుకు ఆసక్తి చూపించలేదు. కొందరు నేతలు తమ ఇళ్లవద్దనే రెండు నిమిషాల పాటు కంచాలతో చప్పుడు చేసి పలాయనం చిత్తగించారు. సిగ్నల్స్‌ వద్ద, డ్రైవింగ్‌ చేసే సమయంలో వాహన చోదకులు కూడా హారన్‌ మోగించలేదు.

ఇదెక్కడి ఉద్యమం బాబూ..?
పార్టీ పెద్దదిక్కు జైల్లో ఉంటే.. పార్టీని ముందుకు నడిపించేందుకు ఏం చెయ్యాలి.? బాబుని బయటకు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలని.. నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్ని ఉత్సాహ పరిచేందుకు వారిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాల్ని పక్కన పెట్టి.. మోత మోగిద్దామంటూ పిలుపునివ్వడంపై ప్రతి ఒక్కరిలోనూ ఆశ్చర్యంతో పాటు అసహనం వ్యక్తమైంది. కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ పద్మనాభం ఆకలి కేక పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించేలా కంచాలు కొట్టాలి అని పిలుపునిచ్చిన సమయంలో రోడ్లపైకి వచ్చిన వందలాది మందిపై తమ ప్రభుత్వం కేసులు బనాయించిన విషయాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకున్నాయి.

తర్వాత కాలంలో ఆ కేసుల్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎత్తివేసిందనీ.. మరోసారి ఇలా రోడ్లపైకి వచ్చి కంచాలు కొట్టడం, హారన్లు కొట్టడం చేస్తే పోలీసులు కేసు పెడితే ఏ నాయకుడు వెన్నుదన్నుగా ఉంటారని కొందరు ప్రశ్నించారు. తమ అవినీతి విషయాన్ని తామే డప్పుకొట్టి ప్రజలకు తెలియజేసినట్లు కార్యక్రమం ఉందని కొందరు టీడీపీ నేతలు తమ కార్యకర్తల వద్ద వ్యాఖ్యానించారు. మోత మోగిద్దాం అంటూ హడావిడి చేయాలని భావించిన టీడీపీ కార్యక్రమం చివరికి మౌనం వహిద్దాం అనేలా మారిపోవడంపై అంతా నవ్వుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement