
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం నుంచి ఉత్తర భారతదేశంలోని పలు ఆలయాలు, దర్శనీయ స్థలాలు సందర్శించుకోవాలనే యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు ప్యాకేజీ ప్రకటించింది. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా.. అనుభవజ్ఞులైన గైడ్‌లతో ఈ టూర్‌ను డిజైన్ చేసింది. ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా ఆఫీసర్ చంద్రమోహన్ బిసా శుక్రవారం ఈ టూర్ వివరాలు వెల్లడించారు. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్(మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేష్‌తో కలిపి) యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు ఉంటుంది. ఈ యాత్ర ఈ నెల 10న ప్రారంభమై 18వ తేదీన ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే వారు మాత్రం సికింద్రాబాద్ లేదా కాజీపేట చేరుకోవాల్సి ఉంటుంది. తాజ్‌మహల్, కృష్ణ జన్మభూమి, బృందావన్‌లోని ప్రేమ్ మందిర్, బాంకే బిహారీ మందిర్, కట్రాలోని మాతా వైష్ణోదేవి టెంపుల్, హరిద్వార్‌లోని మానస దేవి, హర్ కి పౌరి, రిషికేష్‌లోని లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఒకొక్కరికి టికెట్, వసతి, స్థానిక రవాణా చార్జీలతో కలిపి ఎకానమీ రూ.15,435, స్టాండర్డ్ రూ.24,735, కంఫర్ట్ రూ.32,480గా ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఎకానమీ ప్రయాణికులకు నాన్ ఏసీ గదులు, స్టాండర్డ్, కంఫర్ట్ ప్రయాణికులకు ఏసీ గదుల్లో షేరింగ్ పద్ధతిలో వసతి కల్పిస్తారు. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో లేదా చందన్‌కుమార్(82879 32318), విశాలాక్షి(9701085461)ను సంప్రదించాలని చంద్రమోహన్ కోరారు.