
రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదం చేస్తున్న ఆక్రమణదారు కుటుంబ సభ్యులు
ఆరిలోవ: తోటగరువులో ఆక్రమణను అడ్డుకోవడానికి వెళ్లిన రూరల్ రెవెన్యూ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేశారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ తహసీల్దార్ ఎస్.రమణయ్య తెలిపిన వివరాలివీ.. తోటగరువులోని సర్వే నంబర్ 55 కొండవాలులో సుమారు 200 చదరపు గజాల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి చదును చేశాడు. అందులో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆర్.ఐ ప్రవీణ్‌కుమార్, సచివాలయాల వీఆర్వోలు మౌనిక, యువరాజు, సిబ్బందితో కలసి శుక్రవారం నిర్మాణం పనులను అడ్డుకున్నారు. గోడలు తొలగిస్తుండగా ఆక్రమణదారుడి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. మొల్లి హేమంతకుమార్ అనే వ్యక్తి వీఆర్వో యువరాజుపై చేయిచేసుకున్నాడు. దీంతో హేమంతకుమార్‌పై వీఆర్వో ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆక్రమించడం తప్పయితే దాన్ని తొలగించానికి వెళ్లిన సిబ్బందిపై దాడి చేయడం పెద్ద నేరమని తహసీల్దార్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు