
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఓ ఉన్నతాధికారి బంగ్లా అది.. నిరంతరం భద్రత కోసం సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తుంటారు. కానీ నెల రోజులకు పైగా మూడో కన్ను మూసుకుపోయింది. నిరంతర నిఘా ఉండాల్సిన ప్రాంతంలో స్వయంగా ఆ అధికారే సీసీ కెమెరాలు బంద్ చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఆ బంగ్లాలో ఏం జరుగుతోంది?
సిరిపురం, బీచ్‌రోడ్డు సమీపంలో ప్రభుత్వ అధికారుల కోసం బంగ్లాలున్నాయి. ఇందులో ఓ ఐఏఎస్ అధికారికి కేటాయించిన బంగ్లా కూడా ఉంది. ఈ బంగ్లా వద్ద నిరంతర నిఘా కోసం 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే నెల రోజులకు పైగా ఈ సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి. ఆ విభాగానికి చెందిన భద్రతా సిబ్బంది ఈ విషయం తెలుసుకుని కంగారు పడ్డారు. అధికారికి తెలిస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని భయపడ్డారు. కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసిన విషయమేంటంటే.. ఆ ఉన్నతాధికారే సీసీ కెమెరాల కనెక్షన్లను దగ్గరుండి మరీ తొలగించారని సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఆ అధికారి దృష్టికి తీసుకెళ్లగా అదంతా తాను చూసుకుంటానంటూ వారిని పంపించేశారు. అయితే ఆ ఐఏఎస్ అధికారి ఎంతో ముఖ్యమైన సీసీ కెమెరాలను ఎందుకు తప్పించారన్న అంశంపై ఆ విభాగంలోని ఇతర అధికారులు, ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు నిఘా నేత్రం తప్పించడంపై ఆ అధికారి కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.
కొన్ని అనధికార వ్యవహారాలను చక్కబెట్టే క్రమంలో ఎవరికీ ఏ విధమైన అనుమానం రాకుండా ఉండేందుకు ఈ తరహాలో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఆ ఉన్నతాధికారి విజయవాడలో ఓ ఇల్లు కొనుక్కున్నారని.. దానికి సంబంధించి రూ.కోట్ల విలువైన ఫర్నిచర్, ఇతర సామగ్రి ఇక్కడే కొనుగోలు చేసి వాటిని భద్రపరిచేందుకు బంగ్లాలో ఉన్న గదులను వినియోగించుకున్నారన్నది సమాచారం. ఉన్నతాధికారి బంగ్లాలో నెల రోజులకు పైగా సీసీ కెమెరాలు పనిచేయని నేపథ్యంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని.. ఇది చాలా రిస్క్‌తో కూడిన అంశమని అంతా విమర్శిస్తున్నారు.