మెజార్టీ హామీలు అమలు | - | Sakshi
Sakshi News home page

మెజార్టీ హామీలు అమలు

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

మెజార్టీ హామీలు అమలు

వికారాబాద్‌: నాటి ప్రభుత్వం మాటల ప్రభుత్వం అయితే.. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం. రేవంత్‌ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోంది. కొన్ని హామీలు మిగిలి పోవటానికి గత ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పులేనని శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. శనివారం పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్‌ హాల్‌లో 99 రోజుల యాక్షన్‌ప్లాన్‌పై నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు–అభివృద్ధికి సంబంధించిన నివేదిక శాఖల వారీగా అధికారులు చదివి వినిపించారు. ముఖ్యమంత్రి సందేశం సభికులకు చదివి వినిపించారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో అందరం బాగస్వాములమవుదామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన సభాపతి ప్రసాద్‌కుమార్‌.. కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఎస్పీ స్నేహమిశ్రాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో చారిత్రాత్మక పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు సమీక్షకే 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. రెండున్నరేళ్లలో రూ.600 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు వేయిస్తున్నానని తెలిపారు. ప్రతి గ్రామానికి రూ.50 లక్షల నిధులు రోడ్ల నిర్మాణానికి కేటాయించామన్నారు. ఉచిత విద్యుత్‌, రూ.10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు, రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌, సన్నబియ్యం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటి చారిత్రాత్మక పథకాలు తీసుకువచ్చి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయటమే కాకుండా గృహ ప్రవేశాలు సైతం జరుగుతున్నాయన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు పెద్ద మొత్తంలో డైట్‌ చార్జీలు పెంచామన్నారు. అనంతరం కలెక్టర్‌ దీపక్‌ తివారీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య సమన్వయానికి జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కొందరు అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఓ ప్రజాప్రతినిఽధి చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. జనరల్‌గా మాట్లాడకుండా వారెవరో చెబితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ప్రసాద్‌, జెడ్పీ సీఈఓ సుధీర్‌, ఆర్టీఏ సభ్యులు జాఫర్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఆయా శాఖల జిల్లా అధికారులు రేణుక, విజయభాస్కర్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారులు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారు

ప్రొటోకాల్‌కు విరుద్ధంగా స్టేజిపై కూర్చున్న ఓ మాజీ ప్రజా ప్రతినిధి స్పీకర్‌, కలెక్టర్‌ సమక్షంలో మాట్లాడుతూ.. అధికారులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శాఖల వారీగా వైఫల్యాలు వివరిస్తూ అధికారుల పనితీరును తప్పుబట్టారు. వారి చేతగాని తనంతో..వారు సక్రమంగా పని చేయకపోవటంతో ప్రభుత్వం అబాసుపాలవుతుందని సభలో చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు అంటే అధికారులకు లెక్కలేదు.. నియోజకవర్గంలో 24 గ్రామాలకు నీరు లేదు. భూసార పరీక్షా కేంద్రాలకు తాళం వేశారు.. కాంట్రాక్టర్లు సక్రమంగా పని చేయరు. నాణ్యత లేకున్నా అధికారులకు పట్టదు.. రోజుకు ఒక్కో వ్యక్తికి 100 లీటర్ల నీరు ఇస్తున్నామంటూ మిషన్‌ భగీరథ అధికారులు చెబుతున్నారు.. అది నిజమని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఎద్దేవా చేశారు. అఽధికారులు బాగా పనిచేస్తే 50 వేల మెజార్టీతో గెలుస్తాం.. లేదంటే ఏమైతామో ఎవరికీ తెలియదని అన్నారు. అంతటితో ఆగకుండా స్పీకర్‌ జడ్జీలాంటాయన.. ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయి.. ఆయన ఇవన్ని మాట్లాడలేరు..అందుకే ఆయన ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. మరో నాయకుడు ఆర్టీఏ మెంబర్‌ మాట్లాడుతూ.. అధికారులపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజల కన్నీళ్లకు అధికారులు కారణమవుతున్నారు.. అవినీతికి పాల్పడుతున్నారు..అవసరమైతే వారు చేసే అవినీతిని నిరూపిస్తానంటూ పేర్కొన్నారు. అయితే వీరిరువురి మాటలు వివదస్పదంగా మారాయి. సమీక్షకు పిలిచారా..? లేక తమను తిట్టడానికి మీటింగ్‌ పెట్టారా..? అంటూ కొందరు జిల్లా అధికారులు నొచ్చుకున్నారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా అధికారిక కార్యక్రమంలో స్టేజీపై ఎలా కూర్చోబెడతారని అధికారులతో పాటు కొందరు అధికార పార్టీ నేతలే ప్రశ్నించారు.

అభివృద్ధి పనులకు నిధులు

బంట్వారం: అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బస్వాపూర్‌ సర్పంచ్‌ స్రవంతి శనివారం వికారాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో స్పీకర్‌ను కలిసి పలు సమస్యలు వివరించారు. డ్వాక్రా భవనంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా స్పీకర్‌ సానుకూలంగా స్పందించారు. గ్రామాభివృద్దికి నిరంతరం పాటు పడాలని తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని సర్పంచ్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో బస్వాపూర్‌ ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్‌ శివరాజ్‌ పాల్గొన్నారు.

నియోజకవర్గ ప్రజా పాలన కార్యక్రమంలో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

సమావేశంలో సొంత పార్టీ నేతల నుంచి వింత అనుభవం

ప్రొటోకాల్‌ పక్కన పెట్టి ప్రసంగాలు దంచడంపై విమర్శలు

అధికారుల అసహనం

Advertisement
 
Advertisement
Advertisement