నేడు నీట్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు నీట్‌

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

నేడు నీట్‌ రేపు తాండూరుకు మంత్రులు దుద్దిళ్ల, తుమ్మల రైతులను ఇబ్బంది పెట్టొద్దు వికారాబాద్‌ ఠాణాలో శాంతి సమావేశం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

అనంతగిరి: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ దీపక్‌ తివారీ అన్నారు. శనివారం ఆయన ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి నీట్‌ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్‌ విధానం ద్వారా తీసుకుంటామన్నారు. 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని చెప్పారు. పరీక్ష రాసే అభ్యర్థుల తనిఖీ సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాల రవాణాపై పోలీస్‌, రెవెన్యూ, తపాలా శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్‌, పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్‌ పత్రాల తరలింపు నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలన్నారు. పరీక్షా సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా, వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ ఉమా శంకర్‌ ప్రసాద్‌, నీట్‌ కోఆర్డినేటర్‌ సాయిలత తదితరులు పాల్గొన్నారు.

తాండూరు టౌన్‌: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ సోమవారం తాండూరుకు రానున్నారు. పట్టణంలోని కొడంగల్‌ మార్గంలో ఉన్న ఎస్‌వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 9:30 గంటలకు సమావేశం ప్రగతి ప్రణాళిక సభ ప్రారంభమవుతుంది. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొననున్నారు.

అదనపు కలెక్టర్‌ వెంకటాచారి

పరిగి: పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి సూచించారు. శనివారం ఆయన పరిగి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలపై వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలో భూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ రెవెన్యూ అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్‌ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్ధార్‌ విజయేందర్‌, ఆర్‌ఐ దివ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వికారాబాద్‌ డీఎస్పీ అంజయ్య అన్నారు. శనివారం ఆయన వికారాబాద్‌ పీఎస్‌లో బక్రీద్‌ పండుగ సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండుగలు భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలని.. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దన్నారు. ఏమైనా సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘుకుమార్‌, పలువురు అధికారులు, కౌన్సిలర్లు, హిందూ, ముస్లిం మత పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement