కొడంగల్ రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక నివేదిక నిర్వహిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అన్నారు. శనివారం పట్టణంలోని మురారి ఫంక్షన్ హాల్‌లో ఎంపీడీఓ ఉషశ్రీ అధ్యక్ష్యతన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు ప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, అరైవ్–అలైవ్, వ్యవసాయం, తదితర అంశాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆయా పథకాలలో పెండింగ్‌లో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించి పాలనలో పారదర్శకత పాటించేందుకు అన్ని శాఖల అధికారులు కృషిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్: కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి
కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో రూ.4,500 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వివరించారు. పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణానికి నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ.4,500కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. అంతకుముందు వ్యవసాయం, హార్టికల్చర్, హౌసింగ్, ఇందిరా మహిళా శక్తి, రెవెన్యూ, ఎకై ్సజ్, గృహజ్యోతి తదితర శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మానానికి ఇసుక కొరత సమస్యను పరిష్కరించాలని తెలిపారు. చెరువుల అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని అధికారుల దృష్టి తెచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులు ఏర్పాటుచేసిన స్టాళ్లను కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, నారాయణపేట జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్లు రాజేశ్ రెడ్డి, వార్ల విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్లు నాగులపల్లి నాగేందర్, సరస్వతి, మున్సిపల్ కమిషనర్లు బలరాంనాయక్, నాగరాజు, శ్రీకాంత్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సభ్యులు నర్సింలుగౌడ్, ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్, ఎనిమిది మండలాల అన్ని శాఖల అధికారులు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రాజేశ్వరి


