అనంతగిరి: పోలీస్ పరేడ్‌తో క్రమశిక్షణ, సమయపాలన, సిబ్బంది మధ్య సమన్వయం పెరుగుతుందని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని జనరల్ పరేడ్‌కు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీస్ సిబ్బందికి పరేడ్ శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందన్నారు. ప్రతి వారం క్రమం తప్పకుండా పరేడ్‌లో పాల్గొనడంతో క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, యోగా, వ్యాయామం, సమతుల ఆహారం వంటి అంశాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. సిబ్బంది సంక్షేమమే తమ ప్రాధాన్యత అని పేర్కొంటూ, పోలీస్ అధికారులందరూ సిబ్బందికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, ఆర్‌ఐలు నాగరాజు, శ్రీశైలం, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సేవలే గుర్తుండి పోతాయ్
విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. 41 ఏళ్లుగా పోలీసు శాఖలో సుధీర్ఘ సేవలందించి పదవీవిరమణ పొందిన డీఎస్‌బీ ఎస్‌ఐ ఆర్.గోపాల్‌ను శనివారం ఆమె ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి ఉద్యోగవిరమణ తప్పనిసరన్నారు. 41 ఏళ్ల పాటు పోలీస్ శాఖకు విశేషమైన సేవలు అందించడం గొప్ప విషయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఖాజా మొయినుద్దీన్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ స్నేహ మెహ్ర


