రేపటి నుంచి డివిజన్‌ స్థాయి ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి డివిజన్‌ స్థాయి ప్రజావాణి

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

రేపటి నుంచి డివిజన్‌ స్థాయి ప్రజావాణి ఆమనగల్లు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా అరుణ్‌ కుమార్‌ బైక్‌ను ఢీకొట్టిన కారు భిక్షాటన చేస్తూ వ్యక్తి మృతి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: డివిజినల్‌ స్థాయిలో ఈ నెల 4 నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) చంద్రారెడ్డి సంబంధిత ఆర్డీఓలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవో నంబర్‌ 3 ప్రకారం ఆర్డీఓల ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బూత్‌ స్థాయి అధికారులు మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల పైబడిన వారి వివరాలు సేకరించాలన్నారు. నిబంధనల ప్రకారం మ్యాపింగ్‌తో డూప్లికేట్‌ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిశీలించి వివరాలను ధ్రువీకరించి తొలగింపు లేదా సవరణ చేపట్టాలని తెలిపారు.

ఆమనగల్లు: పట్టణంలోని కోర్టులో జూనియర్‌ సివిల్‌జడ్జిగా శనివారం నారం అరుణ్‌కుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కోర్టు జడ్జిగా ఉన్న కాటం స్వరూప బదిలీ కాగా హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టులో అసిస్టెంట్‌ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న అరుణ్‌కుమార్‌ ఇక్కడికి వచ్చారు. పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయనకు ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, తలకొండపల్లి ఎస్‌హెచ్‌ఓ జానకిరాంరెడ్డి, కడ్తాల ఎస్‌హెచ్‌ఓ సైదిరెడ్డి, మాడ్గుల ఎస్‌హెచ్‌ఓ వేణుగోపాల్‌ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులతో జడ్జి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పీపీ కార్తీక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ద్విచక్రవాహనదారులకు గాయాలు

ధారూరు: అదుపుతప్పిన కారు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన శనివారం రాత్రి మండల కేంద్రానికి సమీపంలో కట్ట మైసమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. రుద్రారం గ్రామానికి చెందిన బంటు వెంకట్‌, కస్తూరిపల్లికి చెందిన పాండు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తర లించారు. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

కందుకూరు: అనారోగ్యంతో ఓ భిక్షగాడు మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పులిమామిడిలోని కోటమైసమ్మ దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా అతను వెంకటయ్యచారి అలియాస్‌ పెంటయ్యచారి (60), ఆదిలాబాద్‌ జిల్లాగా గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ, మద్యం తాగుతూ రోడ్డు పక్కనే నివసించేవాడు. తరచూ ఫిట్స్‌ కూడా వచ్చేవి. శుక్రవారం రాత్రి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలిస్తే 87126 62687, 87126 62409, 87126 62369 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జంతుబలిపై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆదిబట్ల బీరప్ప జాతరలో జరిగిన జంతుబలిపై కేసు నమోదైంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శివరాత్రి వెంకటేశ్‌ కథనం ప్రకారం.. ఆదిబట్లలో ఏప్రిల్‌ 27న బీరప్ప జాతరలో భాగంగా గొర్రె పొట్టేళ్లను దేవాలయం ముందు బలిచ్చారు. ఈ వీడియోలను కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. వీటిని చూసి చలించిన స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌జీఓ క్రూయాలిటీ ప్రివెన్షన్‌ మేనేజర్‌ అడులపురం గౌతమ్‌ అనే వ్యక్తి ఏప్రిల్‌ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 15 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement