చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వినతి
చేవెళ్ల: మండలంలోని ఖానాపూర్ గేట్‌ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్–బీజాపూర్ రాహదారి విస్తరణలో సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని ఖానాపూర్, నాంచేరి, రేగడిఘనాపూర్, దేవరంపల్లి, కిష్టాపూర్, ఇంద్రారెడ్డినగర్ గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా నాంచేరి సర్పంచ్ అశోక్, బీజేపీ నాయకుడు జయశంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు అంతా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డు అభివృద్ధిని చూసి ఆనందించాలో లేక ఏర్పడుతున్న ఇబ్బందులతో బాధపడాలో తెలియటం లేదని వాపోయారు. అండర్‌పాస్ లేకుండా రోడ్డును ఎత్తుగా వేస్తుండటంతో ఈ గేట్ వద్ద దాదాపు ఐదారు గ్రామాల ప్రజలు, రైతులతోపాటు అటు షాబాద్ మండలానికి, ఇటు వికారాబాద్‌జిల్లాలోని పలు గ్రామాలకు ఉన్న లింక్‌రోడ్డులు తెగిపోతున్నాయన్నారు. ఖానాపూర్, నాంచేరి, కిష్టాపూర్, రేగడిఘనాపూర్, దేవరంపల్లి గ్రామాలకు వెళ్లే మార్గం లేదన్నారు. ఇక్కడ అండర్‌పాస్ అవసరం ఉందన్నారు. దీంతో పాటు ఈరోడ్డుకు రెండు వైపులా సర్వీస్ రోడ్డు ఉంటేనే హైవే రోడ్డు పక్కల ఉన్న రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఇక్కడి ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా రోడ్డు ఉండేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, చేవెళ్ల బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, నాయకులు మాణిక్యరెడ్డి, శర్వలింగం, ఉమాశంకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.


