అడ్డగుట్ట: చెత్త లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ర్యాపిడో రైడర్ మృతి చెందాడు. వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాలాగూడ ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్న లక్ష్మారెడ్డి (35) ర్యాపిడో రైడర్. కొంతకాలంగా హయత్‌నగర్‌లోని కుంట్లూరులో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ర్యాపిడో రైడ్ రావడంతో తుర్కపల్లికి చెందిన కె.పౌల్ అనే వ్యక్తిని తన బైక్ ఎక్కించుకొని మహేంద్రాహిల్స్‌లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. లాలాపేట మీదుగా వెళ్తుండగా చెత్తలోడ్‌తో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. లక్ష్మారెడ్డి తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో అతడు ధరించిన హెల్మెట్ సైతం ముక్కలై, తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న కస్టమర్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో దుర్మరణం పాలైన ర్యాపిడో రైడర్
మీదినుంచి టైరు వెళ్లడంతో ముక్కలైన హెల్మెట్


