మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరు రూరల్: త్వరలో తాండూరుకు వస్తానని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ మండల నాయకులు పలువురు శుక్రవారం పైలెట్‌ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా తాండూరు పరిణమాలను నాయకులు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ రాజుగౌడ్ మండల యూత్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, నాయకులు మహేశ్, నరేశ్ తదితరులు ఉన్నారు.
రైతు మృతి
బొంరాస్‌పేట: పాముకాటుకు గురైన రైతు నాటువైద్యంతో మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాందార్‌పూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావలి రాములు(59) గురువారం కోతకొచ్చిన వరిపంటను పరిశీలించేందుకు వెళ్లాడు. దీంతో పాముకాటుకు గురయ్యాడు. దీంతో ఆయన గ్రామంలో చేయించుకున్న నాటువైద్యం వికటించి మృతి చెందాడు. శుక్రవారం అంత్యక్రియలు చేశారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : విద్యుత్ తీగలు అల్లుకోవడంతో వచ్చిన నిప్పుతో గడ్డివాము దగ్ధమైంది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాటసింగారం గ్రామంలోని సింగరేణికాలనీలో శుక్రవారం మధ్యాహ్నం రెండు విద్యుత్ తీగలు తగలడంతో నిప్పు రవ్వలు చెలరేగి సమీపంలో ఉన్న దర్నమోని లోకనాథంకు చెందిన ఎండు గడ్డి వాముపై పడ్డాయి. దీంతో గడ్డివాము కాలిబూడిదైంది. వెంటనే అప్రమత్తమైన బాధితుడు సమీపంలోనే ఉన్న పశువులకు ఎలాంటి హాని జరగకముందే దూరంగా తీసుకెళ్లాడు.
● మాజీ ఎమ్మెల్యే కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంజారాహిల్స్: హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు మహ్మద్ రాహీల్ ఆమిర్ చట్టవిరుద్ధంగా దుబాయ్‌కి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాహీల్ ఆమిర్ 2022 మార్చి 17న ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 మీదుగా కారులో బయలుదేరాడు. అదుపుతప్పిన వేగంతో దూసుకెళ్లిన కారు బెలూన్లు అమ్మే మహిళను ఢీకొట్టగా, ఆమెలోంచి చిన్నారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకుగాను తన స్నేహితుడు అఫ్రాన్ కారు నడిపాడంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఆ తెల్లవారే దుబాయ్ పారిపోయాడు. అయితే కేసును లోతుగా విచారించిన పోలీసులకు ఆ రోజు కారు నడిపింది రాహీల్ అని తెలిసింది. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం రాహీల్ హైకోర్టును ఆశ్రయించగా పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ స్పష్టం చేసింది. దీంతో గత నెల 17న జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. విచారణ కొనసాగుతుండగానే గురువారం ఉదయం దుబాయ్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేసి నిందితుడిని మార్గమధ్యంలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మరోమారు రాహీల్ విచారణకు రాగా, దుబాయ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
సాక్షి, సిటీబ్యూరో: రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఏ) భద్రతా వ్యవస్థల క్రమబద్ధమైన నిర్వహణ, పారదర్శక పాలన,ఉమ్మడి స్థలాలపై దృష్టి పెట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. నారెడ్కో తెలంగాణ, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(ఎఫ్‌టీసీసీఐ), యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యు–ఫెర్వాస్) సంయుక్తంగా ఫెడరేషన్ హౌస్‌లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ స్వీయ జనగణనకు మద్దతు ఇవ్వాలని నివాసిత సంఘాలను కోరారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ విక్రంమాన్ సింగ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


