త్వరితగతిన చేసేందుకే
దౌల్తాబాద్: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) బాధ్యతలను ఎంపీడీఓలకు బదలాయిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ పథకం తహసీల్దార్ల పరిధిలో ఉండేది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ముందుగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో మీసేవల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారించి ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించేవారు. తహసీల్దార్లకు క్షేత్రస్థాయిలో పని ఒత్తిడితో పాటు విచారణలోనూ జాప్యం తలెత్తడంతో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు పథకానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిధుల విడుదలను ఎంపీడీఓల పరిధిలోకి తీసుకువచ్చింది.
పథకం వివరాలు
కుటుంబంలోని ప్రధాన సంపాదకుడు మృతిచెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం జాతీ య కుటుంబ ప్రయోజన పథకాన్ని అమలు చేస్తోంది. మరణించిన వ్యక్తి వయస్సు 18–60 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20వేలు అందిస్తుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వేగంగా విచారణ చేపట్టిన వెంటనే నేరుగా ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి.
సాయం పంపిణీలో జాప్యాన్ని నివారించేలా ప్రణాళిక
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కుటుంబ యజమాని మరణిస్తే త్వరితగతిన సాయం అందిచేందుకు ప్రభుత్వం బాధ్యతలను మార్పిడి చేసింది. లబ్ధిదారులకు చెందిన దరఖాస్తులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మంజూరైన నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
– శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్


