తీగల రాపిడి..చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

తీగల రాపిడి..చెలరేగిన మంటలు

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

తాండూరు టౌన్‌: ప్రధాన రహదారిపై వేలాడుతున్న 11 కేవీ విద్యుత్‌ తీగలు ఒకదానికి ఒకటి తగిలి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన పట్టణ శివారు వైట్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపాన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రహదారి గుండా వేసిన లైన్‌ మార్గంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించాయి. అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమా చారంతో ఘటనా స్థలిచి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. విద్యుత్‌ తీగలు వేలాడి ఉండటమే ప్రమాదానికి కారణమని, విద్యుత్‌ అధికారులు స్పందించి వైర్లను సరిచేయాలని ప్రజలు కోరారు.

సేవలతోనే గుర్తింపు

మర్పల్లి: ప్రజలకు అందించిన సేవలే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయని ఏఎంసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్న ఈసీ విఠల్‌ గురువారం ఉద్యోగ విరమణ పొంఆరు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్‌ అధ్యక్షతన మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరై మాట్లాడారు. సూపరింటెండెంట్‌ కృష్ణారావు, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం సమ్మయ్య, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జగదీశ్వర్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు విఠల్‌ దంపతులను సన్మానించి, వీడ్కోలు తెలిపారు.

బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి

హిమాయత్‌నగర్‌ : బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదన చారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన గురువారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌న్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ బీసీల హామీలు తుంగలో తొక్కి, వారి ఆశల మీద నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ పాల్గొన్నారు.

సరోజీని దేవి కంటి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

గోల్కొండ: మెహిదీపట్నంలోని సరోజీనిదేవి కంటి ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్‌ ప్లోర్‌ లోని సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ రూమ్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను సిబ్బంది ఆర్పివేశారు. కాగా ఇండోర్‌ ఏసీ యూనిట్‌ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఇన్‌పేషంట్‌ విభాగం కూడా ఉండడంతో అక్కడ ఉన్న రోగులు ఔట్‌పేషంట్‌కు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఏడిఎఫ్‌వో వి.భానుప్రతాప్‌ తెలిపారు.

రోడ్లకు మరమ్మతు చేయాలని జడ్‌సీకి వినతి

చైతన్యపురి: సరూర్‌నగర్‌ డివిజన్‌ చెరుకుతోట కాలనీ రోడ్‌నంబర్‌–3లోని అంతర్గత రహదారాలు అధ్వాన స్థితిలో ఉన్నాయని వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని కాలనీల సంక్షేమ సంఘాల జేఏసీ చైర్మన్‌ బేర బాలకిషన్‌ కోరారు. ఈ మేరకు గురువారం ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ వికాస్‌ మహతోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాలకిషన్‌ మాట్లాడుతూ... కేపీఎల్‌ షోరూం నుంచి చెరుకుతోట కాలనీ టర్నింగ్‌ వరకు ఉన్న 275 మీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలు పడి పాడై రాకపోకలకు ఇబ్బందులు కలుతున్నాయని వివరించారు. పొచమ్మబస్తీ, పోచమ్మబాగ్‌ కాలనీల సమస్యలను పరిష్కరించాలన్నారు. అంబేడ్కర్‌నగర్‌ కాలనీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్మశానవాటికకు ప్రహరీ నిర్మాణం చేయాలని, చెరుకుతోట కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఓపెన్‌ జిమ్‌ సగంలో ఆగిపోయిందని తెలిపారు. డివిజన్‌లోని పలు కాలనీలలోని రహదారులు, ఇతర సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జోనల్‌ కమిషనర్‌ను శాలువాతో సత్కరించారు. కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తాండ్ర భాస్కర్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement