● కార్పొరేట్ సంస్థల కోసమే ఇదంతా
● ప్రజల ఇందన కష్టాలు తీర్చండి
● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు
వెంకటయ్య
పరిగి: కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చమురు కృత్రిమ కొరత సృష్టించిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ లభించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, కొరతను నివారించి నిరంతరం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం పట్టణ కేంద్రంలో ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బడా కంపెనీలతో అంటకాగుతూ.. సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, చమురు సంస్థలు కలిసి ప్రజలను దోచుకునే పనిలో భాగంగానే ఈ కొరత కుట్ర అని విమర్శించారు. దేశంలో ఎక్కడా ఇందన ఇబ్బంది లేదని చెబుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే చమురు ధరలు పెంచకుండా ఉన్న మోదీ సర్కార్.. ఎన్నికలు ముగిసిన వెంటనే నిల్వలు దాచిపెడుతూ.. ధర పెంచే యోచనలో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు అన్ని చూస్తున్నారని, సమయం చూసి బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.


