నామినేటెడ్‌ ఆశలు | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ ఆశలు

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

పరిగి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం నామినేట్‌ పద్ధతిలో నియమించనుంది. పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు సభ్యుల నియామకానికి నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార పార్టీ నాయకుల్లో పదవులపై ఆశలు మొదలయ్యాయి. గతంలో ప్రతీ సహకార సంఘానికి 13 మంది చొప్పున డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగేవి. సంఘ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునేవారు. ఇలా ఎన్నికై న వారంతా కలిసి ఒకరిని చైర్మన్‌, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా నియమించేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ విధానానికి స్వస్తి పలికినట్లయింది. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. ఈనేపథ్యంలో పాత సంఘాలను రెండుసార్లు పొడిగించింది. ఆతర్వాత పలువురు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లపై అవినీతి ఆరోపణలు రావడంతో గత డిసెంబర్‌ నుంచి ఇన్‌చార్జ్‌ అధికారులను కొనసాగిస్తోంది.

ఎన్నికలపై స్పష్టత కరువు

నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గానూ పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్లకు సహకార సంఘాలున్నాయి. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్‌ విషయంలో స్పష్టత రాలేదు. నామినేటెడ్‌ పద్ధతిలో ఒక్కో సంఘానికి ఎంత మందిని ఎంపిక చేస్తారనేది కూడా కచ్చితంగా తెలియడం లేదు. ఒక్కో సంఘానికి ముగ్గురిని, ఐదుగురిని ఎంపిక చేసి వారిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక విధివిధానాలు రావాల్సి ఉంది. నామినేటెడ్‌ చేసే సభ్యులలో జనరల్‌, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు మహిళా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది.

ఎంపిక ఎమ్మెల్యేలదే..

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పరపతి కల్పనలో ప్రాథమిక సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతు వర్గాల్లో కీలకంగా ఉన్న ఈ పదువులు నియోజకర్గ పరిధిలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల తరహాలో సహకార సంఘాల్లోనూ ఇదే తీరుగా కొనసాగనుంది. దీంతో ఈ పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న నాయకులు స్థానిక ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికార పార్టీ నాయకులకు అవకాశాలు దక్కనున్నాయి.

పీఏసీఎస్‌లలో పదవుల భర్తీపై

నేతల్లో ఉత్కంఠ

పైరవీలు ప్రారంభించిన ఆశావహులు

ఎమ్మెల్యే సూచించిన వారికే

పోస్టులు దక్కే అవకాశం

Advertisement
 
Advertisement
Advertisement