● ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల
● జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం
తాండూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 9వరకు జిల్లా స్థాయి రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి టి.రాజారత్నం తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల నర్సింలు, అంజయ్య, మాధవరెడ్డి, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలోని ప్రతీ క్లస్టర్ నుంచి 50 మంది రైతులు వారోత్సవాలకు హాజరయ్యేలా వ్యవసాయాధికారులకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతు వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తాండూరు నుంచి ప్రారంభించనున్నారన్నారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్‌రెడ్డి, రామ్మోహర్‌రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారీ, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అనుభంధ శాఖల అధికారులు హాజరవుతారని చెప్పారు. ఈ వారోత్సవాల్లో రైతులు పంట ఉత్పత్తుల స్టాల్స్ ప్రదర్శించనున్నారు. మరోవైపు ఉద్యాన శాఖ అయిల్ ఫామ్ సాగు చేసే రైతులు, పట్టు పరిశ్రమ సాగు చేసే రైతులు, పశు సంవర్ధక శాఖ నుంచి లబ్ధి పొందుతున్న రైతులు తప్పక హజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులున్నారు.


