దుద్యాల్: నిరుపేదల ఆకలి తీర్చాల్సిన సన్నబియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ బియ్యానికి కర్ణాటకలో మంచి డిమాండ్ ఉంది. దీంతో కొంతమంది ముఠాగా ఏర్పడి దందాకు తెరలేపారు. లబ్ధిదారులకు కిలోకు రూ.15 చొప్పున చెల్లించి, రూ.30 లెక్కన విక్రయిస్తున్నారు. ఈక్రమంలో పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారుతోంది. స్థానిక వ్యాపారులు, దళారులు సేకరించిన రేషన్ బియ్యాన్ని ముందుగా తెలంగాణ– కర్ణాటక సరిహద్దు గ్రామాలకు తరలించి, అక్కడి నుంచి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. దుద్యాల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి బియ్యం సేకరించి, దౌల్తాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నారు.
నేరమని తెలిసినా..
ఆటోలు, ఇతర వాహనాల ద్వారా గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం సేకరిస్తున్న దళారులు వీటిని ఒకచోట డంప్ చేస్తున్నారు. లోడ్‌కు సరిపడా సరుకు సిద్ధం కాగానే, ఆటోల్లో నింపి మరో చోటకు తరలిస్తున్నారు. కొంత కమీషన్ తీసుకుని పెద్ద వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని బడా వ్యాపారులు లారీలు, డీసీఎంలలో నింపి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు.వారం క్రితం మండలంలోని పలు గ్రామాల్లో దాడులు చేసిన అధికారులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దీనిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. రేషన్ బియ్యం అమ్మడం, కొనడం నేరమని తెలిసినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లయ్ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు.
కిలోకు రూ.15కు కొనుగోలు.. రూ.30 చొప్పున విక్రయం
మండలంలో జోరుగా అక్రమ దందా
లక్షలు సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
రాష్ట్రం దాటి వెళ్తున్న పేదల బియ్యం


