గడువులోగా చెల్లించాలి
● ఆస్తి పన్ను కట్టని వారికి నోటీసులు
● వసూలుపై స్పెషల్ ఫోకస్
తాండూరు: మున్సిపల్ యంత్రాంగం ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేసింది. మరో మూడు వారాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ప్రభుత్వానికి మున్సిపల్ ఆదాయం, ఖర్చులు లెక్క చూపాలి. కాగా మున్సిపాలిటీకి ప్రధానంగా వచ్చే ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్ యంత్రాంగం వెనుకబడింది. ఇప్పటి వరకు కేవలం 40 శాతం ఆస్తి పన్ను మాత్రమే వసూలు చేసింది. గతంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే బిల్‌కలెక్టర్‌లు పన్నులు వసూలు చేసి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వంత శాతం లక్ష్యాన్ని చేరుకున్న ధాఖలాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం వసూళ్లలో వెనుకబడడంతో సిబ్బంది పనితీరుపై మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
పన్ను కట్టకుంటే రెడ్ నోటీస్
తాండూరు మున్సిపాలిటి ప్రక్షాళనకు పాలకవర్గం అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని రాబట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులను సమకూర్చేందుకు సిద్దమవుతోంది. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల సమయంలో మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్‌రెడ్డి పాలన వ్యవహారాలను చక్కబెడుతున్నారు. బకాయిదారులు పన్ను చెల్లించకపోతే మున్సిపల్ చట్టం–2019 ప్రకారం ఆస్తులు జప్తు చేస్తామని రెడ్ నోటీసులను జారీ చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో 14,750 ఆవాసాలున్నాయి. ప్రతి ఏటా ఆస్తి పన్నుల రూపంలో మున్సిపాలిటికి రూ.9.82కోట్ల ఆదాయ లక్ష్యం ఉంది. అందులో ఇప్పటి వరకు రూ.2.88 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశారు. ఇంకా రూ.6.94 కోట్ల పన్నులను వసూలు చేయాల్సి ఉంది. పన్ను వసూళ్లలో రెవెన్యూ అధికారి, ఆర్‌ఐ, బిల్ కలెక్టర్‌లు. వార్డు అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ విభాగంలో సిబ్బంది అవినీతి నిరోధక శాఖకు లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్‌కు గురయ్యారు. దీంతో రెండు మూడు నెలల పాటు పాలన వ్యవహారాలు స్తంభించాయి. అనంతరం మున్సిపల్ అధికారుల బదిలీలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వరుసగా రావడంతో ఆస్తి పన్ను వసూళ్లకు ఆటంకం కలిగింది.
బకాయిదారులు ఆస్తిపన్నులు చెల్లించి సహకరించాలి. మున్సిపల్ రెవెన్యూ విభాగం నుంచి బిల్ కలెక్టర్‌లు పన్నుల వసూలుకు వార్డులకు వస్తారు వారికి బిల్లులు చెల్లించాలి. ఆన్‌లైన్ సదుపాయం కూడా కలదు. ఈ నెల 31వ తేదీ నాటికి పన్ను చెల్లించకపోతే 2 శాతం అదనపు పన్నుతో పాటు చక్రవడ్డీ వసూలు చేస్తాం.
– మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తాండూరు


