ఉద్రిక్తతకు దారితీసిన శివాజీ విగ్రహ ఏర్పాటు
పహాడీషరీఫ్: మహా శివరాత్రి పర్వదినాన మామిడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని నూతన విగ్రహావిష్కరణ కోసం గ్రామంలోని వార్డు కార్యాలయం ఎదుట పంచముఖి హనుమాన్ వ్యాయామశాల కమిటీ ఆధ్వర్యంలో దిమ్మెను నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎలాంటి అనుమతులు లేకుండా దిమ్మె నిర్మించి, విగ్రహం ఏర్పాటు విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ జల్‌పల్లి సర్కిల్ ఏఎంసీలు వినయ్, జ్యోతి ఆదివారం ఉదయం 6 గంటలకే చేరుకొని కూల్చివేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న వ్యాయామశాల కమిటీ, బజ్‌రంగ్‌దళ్ నాయకులు ఆర్‌జీఐఏ డివిజన్ ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్, పహాడీషరీఫ్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ గౌరీ నాయుడుతో చర్చించారు. అనుమతి లేకపోవడంతో కూల్చివేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో మామిడిపల్లి, జల్‌పల్లి, శ్రీరామ కాలనీలకు చెందిన వందలాది బజరంగ్‌దళ్, గ్రామయువకులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో బాలాపూర్, ఆర్‌జీఐఏ, ఆదిబట్ల, శంషాబాద్ పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు సుధాకర్, కనకయ్య, రవికుమార్, పవన్ కుమార్ అదనపు బలగాలతో అక్కడికి చేరుకొని బందోబస్తు కొనసాగించారు. దిమ్మెను కూల్చబోమని, అనుమతులు తెచ్చుకునేంత వరకు విగ్రహాన్ని తొలగించుకోవాలని పోలీసుల సూచన మేరకు నిర్వాహకులు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.


