నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్
తాండూరు టౌన్: వరకట్నం తేవాలంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ, సీపీఎం, మహిళా, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన అనూష(20)ను భర్త పరమేష్ అత్యంత దారుణంగా కర్రతో కొట్టి చంపిన విషయం విధితమే. మృతురాలి తల్లి చంద్రమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులను ఆదివారం వారు పరామర్శించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. అందరినీ ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుని భార్యను హత్య చేయడం దారుణమన్నారు. విచక్షణ కోల్పోయి, క్రూర జంతువులా ప్రవర్తించిన భర్త పరమేష్‌ను, కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేసిన అత్త, మామలతో పాటు, హత్యకు కారకులైన వారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేరాలకు కారణమైన డ్రగ్స్, మద్యం వంటి వాటిని అరికట్టడం, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇలాంటివి పునరావృతమైతే ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని కేఎన్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, సీపీఎం నాయకుడు కె.శ్రీనివాస్, మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అలివేలు, మల్కయ్య, పి.శ్రీనివాస్, సాధిక్, శివకుమార్ తదితరులు హెచ్చరించారు.


