మా పొలంలోకి నాలా మళ్లించారు
శంకర్‌పల్లి: ప్రైవేట్ భవన నిర్మాణ సంస్థ తమ అధీనంలోని భూమిలో నక్ష నాలాని ఉందంటూ, రికార్డులు మార్చారంటూ శంకర్‌పల్లికి చెందిన రైతులు సానికే పాండు, కృష్ణ, ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ సర్వే నం.24, 25లో తమ ముగ్గురు అన్నదమ్ములకు దాదాపు 12 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే సర్వే నం.23లో ఓ పెద్ద భవన నిర్మాణ సంస్థ విల్లాల నిర్మాణం చేపట్టింది. దాంట్లో ఉన్న నక్ష నాలాని సర్వే నం.25లో ఉన్నట్లు అక్రమంగా రికార్డుల్లోకి ఎక్కించారని ఆరోపించారు. దీనిపై గత ఆరు నెలల నుంచి పోరాటం చేస్తూ, డిసెంబర్ 1న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 3న హైకోర్టు న్యాయమూర్తి గతంలో ఉన్న మాదిరిగానే ఉన్నట్లు నక్ష నాలాని పునరుద్ధరించాలని సంబంధిత నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించారని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మొర పెట్టుకున్నారు. ఇప్పటికై నా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


