పాలకులొచ్చేశారు..
త్వరలో శిక్షణ కార్యక్రమాలు
వికారాబాద్: గ్రామ పంచాయతీ పాలకమండళ్లు సోమవారం కొలువుదీరనున్నాయి. ఈ నెల 20నే కొత్త సర్పంచులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా ముహూర్తాలు బాగాలేవనే అభ్యర్థన మేరకు ప్రభుత్వం 22వ తేదీకి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మార్చింది. దీంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏర్పాట్లలో మునిగితేలారు. ముఖ్య నాయకులు, తెలిసిన వారిని ఆహ్వానిస్తున్నారు. 2019 జనవరిలో జీపీ ఎన్నికలు జరగ్గా 2024 జనవరితో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగింది. ప్రస్తుతం కొత్త సర్పంచ్‌లు గెలిచిన నేపథ్యంలో ప్రత్యేక పాలనకు తెరపడింది.
ముస్తాబైన పంచాయతీలు
జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్త పాలనకు కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. సర్పంచులు కొత్త కుర్చీలు, ఫర్నీచర్ తెచ్చుకొని పాలన ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఆత్మీయులు, బంధుమిత్రులను తమ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. అంతేకాకుండా గెలిచిన ఆనందంలో సన్నిహితులతో కలిసి విందులు, వినోదాలు చేస్తున్నారు. ఓడిపోయిన వారు బాధలో ఉండగా గెలిచిన వారు ఫాంహౌస్‌లు, పొలాలు, పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు చేసుకోవడంలో మునిగిపోయారు. జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులు ఉన్నాయి. 75 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆర్థిక సంఘం నిధులపైనే..
పోలింగ్ ప్రక్రియ ముగిసిన రోజే ఉపసర్పంచ్‌లను కూడా ఎన్నుకున్నారు. ఈ నెల 17వ తేదీతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. 22న కొత్త పాలకమండళ్ల ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయించడానికి జిల్లా పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త పంచాయతీలు కొలువుదీరిన అనంతరం మొదటి సమావేశం జరునుంది. జిల్లాకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు కూడా త్వరలో విడుదల కానున్నాయని పంచాయతీ అధికారులు తెలియజేస్తున్నారు. రెండేళ్లుగా సర్పంచులు లేకపోవటం, నిధుల విడుదల ఆగిపోవంతో ప్రస్తుతం పంచాయతీలు అభివృద్ధి కుంటుపడింది. అంతేకాకుండా గత పాలకుల హయాంలో చేసిన పనులకు సంబంధించిన రూ.30 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులలేమి, ప్రజా ప్రతినిధులు లేకపోవటంతో పంచాయతీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రోడ్లు, వీధి దీపాల వంటి సమస్యలు పల్లెలను పట్టి పీడిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే సర్పంచులకు తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నేడే సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
స్వాగతం పలకనున్న కార్యదర్శులు
జిల్లాలో 594 పంచాయతీలు, 5,058 వార్డులు
గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలు
సవాల్‌గా మారనున్న నిర్వహణ భారం
15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు
కొత్తగా ఎన్నికై న సర్పంచులకు నూతనంగా రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. గ్రామపాలన, సర్పంచుల విధులు, బాధ్యతలు, నిధులు, హరితహారం, గ్రామాభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, అంతర్గత రోడ్లు నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతలుగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రి, స్టేషనరీని సమకూర్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు తీసుకుంటే తమ గ్రామాలు, వార్డులు బాగుపడతాయని ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.


