కుష్టు రహిత సమాజమే లక్ష్యంగా..
వ్యాధి అంతమే లక్ష్యం
కొడంగల్ రూరల్: కుష్టు వ్యాధిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ వ్యాధి గ్రస్తులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేయనుంది. ఇందుకోసం 698 మంది ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటోంది.
వ్యాధి వ్యాప్తి ఇలా..
కుష్టువ్యాధి అనేది లెప్రో మైక్రో బ్యాక్టీరియా, లెప్రమోటోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు చేరుతుంది. ఇది సోకిన ఏడు రోజుల వరకు బ్యాక్టీరియా బతికే ఉంటుంది. శరీరంపై తెల్టి, రాగి, స్పర్శలేని మచ్చలు, మొద్దుబారిన మచ్చలు రావడం, ఆ ప్రదేశంలో స్పర్శ లేకపోవడం, చేతి గోళ్లలో, నరాల్లో తిమ్మిర్లు రావడం, శరీరంపై వెంట్రుకలు రాలిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వైద్యుల సలహా మేరకు మందులు వాడితే వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ముందుగా గుర్తిస్తే మంచిది
కుష్టు వ్యాధి అనేది అంత ప్రమాదకరమైనది కాదని, పూర్తిగా నయం కాని జబ్బేమి కాదని, నిర్లక్ష్యం చేస్తే మాత్రం కబళించే ప్రమాదం ఉంటుందని, మల్టీడ్రగ్ థెరపీతో నయం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందజేస్తున్నారు.
ఇంటింటి సర్వే..
జిల్లాలో ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 698 మంది ఆశా కార్యకర్తలతో 1,99,465 కుటుంబాల్లో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. రోజూ ఒక్కో బృందం 20 నుంచి 25 ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి కుటుంబంలో వారి ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది గుర్తిస్తూ వ్యాధి సంబంధిత లక్షణాలున్న వారిని గుర్తిస్తూ పేర్లు, వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వారి వివరాలను సేకరిస్తూ జిల్లా స్థాయి వైద్య బృందం 15 రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే పూర్తి స్థాయిలో వైద్యం అందించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 78 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపడుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేయాలని, వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందిస్తూ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం అడుగులు
అనుమానితులను గుర్తించే పనిలోవైద్య ఆరోగ్య శాఖ
వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స, మందులు
కుష్టు వ్యాధిని అంతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. వైద్యుల సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడడంతో వ్యాధి తగ్గుతుంది.
– డాక్టర్ రవీంద్రయాదవ్, టీబీ, లెప్రసీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి
కుష్టు రహిత సమాజమే లక్ష్యంగా..


