కేంద్రం నిధులతోనే అభివృద్ధి
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
● బీజేపీ సర్పంచ్‌లకు సన్మానం
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి జరుగుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని కొండా బాలకృష్టారెడ్డి ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మద్దతుతో పోటీ చేసి గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ పాలన వచ్చాకే గ్రామాల రూపు రేఖలన్నీ మారిపోయాయన్నారు. ప్రతి పల్లెకూ నేరుగా కేంద్రం నిధులు అందుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో రోజు వారి కూలీ ధరలు పెంచిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. పనిదినాలను పెంచడం జరిగిందన్నారు. గ్రామాల్లో వేస్తున్న రోడ్డన్నీ ఉపాధి హామీ పథకం కింద మంజూరైనవేని అన్నారు. రైతులకు ఏడాదిలో రెండు దఫాలుగా పంట పెట్టుబడి డబ్బు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదని, దీంతో సర్పంచ్‌లు అప్పులపాలయ్యారని పేర్కొన్నారు. సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేపట్టి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని, ఆ కుటుంబంలోనే ఇప్పుడు కొట్టాటలవుతున్నాయని ఆరోపించారు. నేటి పరిస్థితులను చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యేట్లున్నాయని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సదానందారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌కుమార్, నాయకులు శివరాజు, మారుతీకిరణ్, వికారాబాద్ కోఆర్డినేటర్ వడ్ల నందు, కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రాచ శ్రీనివాస్‌రెడ్డి, కేపీ రాజు, విజయభాస్కర్, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, పోకల సతీష్, రాజేందర్‌రెడ్డి,, సుచరితారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


