కక్ష సాధింపు చర్యలు సరికాదు
● ఉపాధి హామీ పథకం పేరు మార్పు దారుణం
● డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్
● వికారాబాద్ పట్టణంలో నిరసన ర్యాలీ
అనంతగిరి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం వీబీ–జీ రామ్–జీ –2025 బిల్లుకు వ్యతిరేకంగా వికారాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్కు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ పేరు మార్చినంత మాత్రాన ప్రజల నుంచి గాంధీ కుటుంబాన్ని దూరం చేయలేరన్నారు. ఈ బిల్లు తీసుకురావడం రాజకీయ కక్ష సాధింపు తప్ప, ప్రజలకు మంచి చేసే పని కాదన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో పల్లెల్లో ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. ఈ పథకాన్ని రద్దు చేస్తే నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదానీ, అంబానీల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. కరోనా సమయంలో ఈ పథకం ద్వారా ఎంతోమందికి ఉపాధి లభించిందని గుర్తుచేశారు. ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరక్టర్ కిషన్‌నాయక్, ఆర్‌టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఎండీ హఫీజ్, గుడిసె లక్ష్మణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం, శ్రీనివాస్, సతీష్‌రెడ్డి, వహిద్‌మియా, శ్రీనివాస్‌గౌడ్, దీపు, వేణుగోపాల్ పాల్గొన్నారు.


