గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
నందిగామ: సరుకులతో పరిశ్రమ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే లారీ డ్రైవర్ గుండె పోటుకు గురై మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రంగాపూర్‌లో చోటు చేసుకుంది. నందిగామ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం .. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాలూల్(37) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామ శివారులోని పీఅండ్‌జీ పరిశ్రమలో ఆదివారం సరుకులను లోడ్ చేసుకొని హైదరాబాద్ వైపు బయలుదేరాడు. లారీ నందిగామ మండలం రంగాపూర్ వద్దకు చేరుకోగానే జాలూల్‌కు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో లారీని రోడ్డు పక్కన నిలిపాడు. స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు చికిత్స నిమిత్తం వెళ్లాడు. డాక్టర్ వచ్చే లోపే కుప్పకూలి మృతి చెండాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.


