నిందితులను శిక్షించాలి
తాండూరు: కోట్‌పల్లి సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్యపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వీరశైవ సమాజం సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం వారు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. దాడిలో గాయపడిన సంగయ్య ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సమాజం సభ్యులతో పాటు సర్పంచ్‌లు మైలారం రాజ్‌కుమార్, పటేల్ విజయ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ లింగదల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సోమవారం యథావిధిగా ప్రజావాణి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.
సాక్షి,సిటీబ్యూరో: వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై ఈ నెల 22న సాయంత్రం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేనిమను చౌదరి తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చర్లపల్లి స్మార్ట్ టెర్మినల్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణనష్టం తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగా హన కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ రావల్‌కోల్ కు చెందిన రవీందర్ శబరిమల యాత్రలో మృతి చెందాడు. రావల్‌కోల్ గ్రామస్థులు తెలిపిన మేరకు.. రవీందర్(42) మేడ్చల్‌లో బోర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం గ్రామ అయ్యప్పభక్తులతో కలిసి శబరి యాత్రకు వెళ్ళాడు. పళని సుబ్రమణేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శనివారం కాలినడకన కొండ ఎక్కాడు. కొండ ఎక్కి దేవుడి దర్శనం కోసం క్యూలైన్‌లో నిలబడి ఉండగా అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానిక ఆసుపత్రి కి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని మేడ్చల్‌కు తరలిస్తున్నారు.
చంచల్‌గూడ: తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసిన ఇద్దరిపై మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ తహసీల్దారు నిహారిక ఫిర్యాదు మేరకు.. చావణీకి చెందిన నహిదాబేగం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రెన్యువల్ చేయాలని మహ్మద్‌మూసా అనే వ్యక్తి మండల కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. వీటిని పరిశీలించిన తహసీల్దారు తన నకిలీ సంతకం, కార్యాలయం సీల్ గతేడాది జారీ అయినట్లు గుర్తించారు.దీంతో మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్టిఫికెట్లు తీసుకొచ్చిన మహ్మద్ ముసాతో పాటు నహిదాబేగంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వెంగళరావునగర్: సైబర్ నేరాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నగరంలో ప్రతిరోజు కోటి రూపాయల వరకు ఈ తరహా నేర గాళ్ళు కొట్టేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ తెలియజేశారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీ శ్రీసాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీహాల్‌లో శనివారం సైబర్‌క్రైమ్‌పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమిషనర్ సజ్జనర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సగటున రూ.250 కోట్ల మేర నగదును సైబర్ దొంగలు దోచుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా నగర ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహనా శిబిరాల ద్వారా చైతన్య పరుస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, సైబర్ క్రైమ్, వెస్ట్‌జోన్ డీసీపీలు వి.అరవింద్‌బాబు, సిహెచ్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిందితులను శిక్షించాలి


