భూములు అప్పగిస్తే రూ.20 లక్షలు
● జనరల్ అవార్డు ప్రకటిస్తే రూ.7లక్షలే..
● అదనపు బెనిఫిట్లు అందవని
అధికారుల వెల్లడి
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక వాడ కొరకు గతంలో ప్రభుత్వం 1,175.35 ఎకరాల భూ సేకరణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రైతులు అంగీకారం తెలుపుతూ దాదాపు వెయ్యి ఎకరాల భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 175.35 ఎకరాల భూమిని రైతులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. పలు మార్లు రెవెన్యూ అధికారులు లగచర్ల గ్రామంలో అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించి సంబంధిత రైతులకు వివరించారు. భూములు ఇవ్వకుంటే జనరల్ అవార్డు కింద కోర్టు అప్పగిస్తామని రైతులకు చెప్పారు. ఇలా చేస్తే ఎకరాకు దాదాపుగా రూ.7 లక్షలు మాత్రమే వస్తాయని, అదనపు బెనిఫిట్లు రావని రైతులకు వివరించారు. అక్టోబర్ 23న సమావేశం నిర్వహించి చివర అవకాశం కల్సిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌లు వివరించారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండు రోజుల క్రితం ప్రభుత్వం 175.35 ఎకరాల భూమికి సంబంధించి 58 మంది రైతులకు జనరల్ అవార్డు ప్రకటిస్తున్నట్లు ప్రకటన వెళ్లడించారు. ఇప్పటికై న రైతులు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే మేలు చేకూరే అవకాశం ఉందని తెలుస్తుంది. జనరల్ అవార్డు కింద కోర్డుకు అప్పగిస్తే ఎకరాకు రూ.7 లక్షల వరకు మాత్రమే వస్తాయని, లేదని అంగీకారం తెలిపి భూములు అప్పగిస్తే ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల డీటీసీపీ లేఅవుట్ కల్గిన ఇంటి స్థలం, ఒక ఇందిరమ్మ ఇళ్లు, పారిశ్రామిక వాడలో కుటుంబానికి ఒక ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వం కోర్డుకు అప్పగించక ముందే రైతులు నిర్ణయం తీసుకుంటే లబ్ధిచేకూరుతుందని, లేదంటే నష్టం పోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైతులు అంగీకారం తెలుపుతారో..లేదో వేచి చూడాలి.


